దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారందరికీ ఈ ఏడాది చివరి కల్లా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్న కేంద్రం మాటలు అసత్యాలన్నారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అదంతా ఓ బూటకంగా ఆమె అభివర్ణించారు. రాష్ట్రాలకు కేంద్రమే ఉచితంగా టీకాలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
'డిసెంబర్ నాటికి అర్హులందరికీ వ్యాక్సిన్ ప్రకటన ఓ బూటకం. కేంద్రం ఇలానే చెబుతూ ఉంటుంది. బిహార్ ఎన్నికలకు ముందూ ఇలానే చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని! కానీ, అక్కడ అలాంటిదేమీ లేదే' అని మమత అన్నారు. ఇప్పుడున్న వ్యాక్సిన్ల మధ్య వ్యవధి ప్రకారం అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ వేయాలంటే కనీసం ఆరు నెలల నుంచి సంవత్సరమైనా పడుతుందని అంచనా వేశారు. రాష్ట్రంలో 10 కోట్ల మంది జనాభాకు వ్యాక్సిన్ల కోసం రూ.150 కోట్లు వెచ్చిస్తే ఇప్పటి వరకు వచ్చింది కేవలం 1.4 కోట్ల డోసులేనని మమత వివరించారు.
నవీన్ ఆలోచన ఇలా...
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రానున్న కొవిడ్ వ్యాప్తుల నుంచి ప్రజలను రక్షించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. రాష్ట్రాలకు కావాల్సిన వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి, పంపిణీ చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారు. స్వాతంత్యం సాధించిన తర్వాత భారత్ ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య ఇదేనని ఆయన అన్నారు. ఈ మహమ్మారి నుంచి గట్టెక్కడానికి కేంద్రంతో కలిసి నడుస్తూ సహకార సమాఖ్యవాద స్ఫూర్తిని చాటాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నవీన్ పిలుపు నిచ్చారు. వ్యాక్సినేషన్‌కు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చేంత వరకు ఏ రాష్ట్రమూ క్షేమం కాదని, అలాగని వ్యాక్సిన్ల కొనుగోలు అంశం రాష్ట్రాల మధ్య చిచ్చు రేపేలా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
"రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. కేంద్రం అనుమతి లేకుండా అంతర్జాతీయ వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు టీకాలను పంపిణీ చేసేందుకు మొగ్గు చూపడం లేదు. వ్యాక్సిన్ సరఫరాకు రాష్ట్రంలో ఒప్పందం చేసుకున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అంటున్నాయి. దేశీయ ఉత్పత్తి సంస్థలు అవసరానికి తగ్గ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్రాలు గుర్తించాలి."
-నవీన్ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాల అవసరాల మేరకు కేంద్రమే వ్యాక్సిన్లను కొనుగోలు చేసి, పంపిణీ చేస్తే బాగుంటుందని నవీన్ పట్నాయక్ చెప్పారు. కానీ, వ్యాక్సినేషన్ విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయాలని అన్నారు.
ఇవీ చూడండి: