బంగాల్లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించినా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే నివేదిక పంపించకపోతే.. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హింసాత్మక ఘటనలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
హింసను అరికట్టేందుకు బంగాల్ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టనందున బంగాల్లో ఇంకా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయని బంగాల్ ప్రభుత్వానికి పంపిన లేఖలో కేంద్ర హోం శాఖ పేర్కొంది. బంగాల్లో ఆదివారం ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో మంగళవారం వరకు ఆరుగురు మృతి చెందారు. అయితే.. టీఎంసీ మద్దతునిచ్చే గూండాలు తమ పార్టీ కార్యాలయాలపై, కార్యకర్తలపై, వారి ఇళ్లపై దాడులు చేస్తున్నారని భాజపా ఆరోపించింది. 14 మంది కార్యకర్తలు మరణించారని, దాదాపు లక్ష మంది ప్రజలు తమ ఇళ్లను వీడి వెళ్లారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ఆరోపించారు.
అవన్నీ నకిలీ వీడియోలు..
మరోవైపు.. భాజపా అభ్యర్థులు విజయం సాధించిన ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. పాత వీడియోలను సామాజిక మాధ్యమాల్లో భాజపా షేర్ చేస్తోందని ఆరోపించారు. బుధవారం బంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.
"బంగాల్లో హింసాత్మక ఘటనలు జరిగే సందర్భంలో.. శాంతి భద్రతలను ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తోంది. రాష్ట్రంలో మూడు నెలలుగా శాంతి భద్రతలు క్షీణించాయి. అప్పుడప్పుడు చెదురుముదురు ఘటనలు జరిగాయి. కానీ, అన్నీ వాస్తవాలు కావు. అందులో చాలా వరకు నకీలీవే. పాత వీడియోలను భాజపా ఇప్పుడు చూపిస్తోంది. "
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్లు తేలిన వారిపై తాము కఠిన చర్యలు తీసుకుంటామని మమత పేర్కొన్నారు.
ఇదీ చూడండి: దీదీకి మోదీ శుభాకాంక్షలు- గవర్నర్ సెటైర్లు