దేశంలో మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ వైరస్ కట్టడికి హోంమంత్రిత్వ శాఖ కీలక మార్గదర్శకాలు జారీచేసింది. కొవిడ్ వ్యాప్తి నిరోధానికి టెస్ట్-ట్రాక్-ట్రీట్ విధానాన్ని కచ్చితంగా అమలుచేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి 30 వరకు అమల్లో ఉంటాయి.
ఆర్టీపీసీఆర్ పరీక్షలు తక్కువగా చేస్తున్న రాష్ట్రాల్లో వాటిని తక్షణమే 70శాతానికి పెంచాలని కేంద్రం సూచించింది. పాజిటివ్ వచ్చిన వారికి సరైన చికిత్స అందించాలని పేర్కొంది. రద్దీ ఉండే ప్రదేశాలు, పని చేసే ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు, ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని తెలిపింది.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా ఆంక్షలు విధించుకోవచ్చని హోంశాఖ స్పష్టం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగడం ఆందోళనకరమని, వెంటనే దానిని వేగవంతం చేయాలని చెప్పింది.
అంతరాష్ట్ర రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు, మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు తెలిపింది.
ఇదీ చూడండి: '45 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా టీకా'