Netaji Subhash Chandra Bose statue: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్ని నెలకొల్పనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం పట్ల ఆయన మనవడు.. చంద్రకుమార్ బోస్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అన్ని మతాలను కలుపుకుని పోయే నేతాజీ సిద్ధాంతాలను ప్రభుత్వం ఆచరణలోకి తీసుకురాల్సిన అవసరం ఉందని చంద్రకుమార్ బోస్ సూచించారు. నేతాజీ భావజాలన్ని అమలులోకి తీసుకురావడమే..ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. నేతాజీ ఎల్లప్పుడూ అన్ని మతాలను కలుపుకుని పోయే సమ్మిళిత రాజకీయాలను విశ్వసించేవారని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఆజాద్ హింద్ ఫౌజ్, అజాద్ హింద్ ప్రభుత్వాన్ని నడిపించారని చంద్రకుమార్ బోస్ తెలిపారు. నేతాజీ భావజాలాన్ని అనుసరిస్తూ దేశంలో ప్రస్తుతం అసమ్మతి, మత రాజకీయాల ధోరణికి వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు.
యువతను నేతాజీ భావజాలానికి అనుగుణంగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చంద్రకుమార్ బోస్ అన్నారు. లేకుంటే దేశంలో మరో విభజన.. అనివార్యమయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ సమ్మిళిత రాజకీయాలను అవలంబించాలని నేతాజీ మనవడు సూచించారు. అదే నేతాజీకి ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. 1947లో నేతాజీ దేశానికి తిరిగి వచ్చుంటే.. దేశం సహా బంగాల్ విభజన జరిగి ఉండేది కాదన్నారు. దేశం ఐక్యంగా ఉండాలంటే నేతాజీ భావజాలన్ని ప్రభుత్వం ఆచరణలోకి తీసుకురావడమే ఏకైక మార్గమని చంద్రకుమార్ బోస్ పేర్కొన్నారు.
నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ మొదటి నుంచి.. భాజపాకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ కోల్‌కతా లోక్‌సభ స్థానం నుంచి కమలం పార్టీ టికెట్‌పై పోటీ చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: నేతాజీకి కేంద్రం ఘన నివాళి.. ఇండియా గేట్ వద్ద విగ్రహం