దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ హత్యాచార కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). విచారణలో భాగంగా ఘటన జరిగిన ప్రదేశాన్ని మరోమారు పరిశీలించింది అధికారుల బృందం. అక్కడి నుంచి పలు నమూనాలను సేకరించింది.
ఘటనా స్థలానికి.. హత్యాచారానికి గురైన యువతి కుటుంబసభ్యులనూ తీసుకెళ్లినట్లు అధికారవర్గాలు తెలిపాయి. నేరం జరిగిన రోజున ఏం జరిగింది? అనే అంశంపై కుటుంబ సభ్యుల నుంచి పలు వివరాలు తీసుకున్నట్లు పేర్కొన్నాయి.
అంతకు ముందు అక్టోబర్ 13న ఘటనా స్థలాన్ని మొదటిసారి పరిశీలించింది సీబీఐ. బాధితురాలి సోదరుడ్ని అక్కడికి తీసుకెళ్లింది. ఇప్పుడు మరోమారు నమూనాలు సేకరించటం ప్రాధాన్యం సంతరించుకుంది.
సెప్టెంబరు 14న దళిత యువతిపై సాముహిక అత్యాచారం జరిగింది. తీవ్ర గాయాలపాలైన ఆమె దిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబరు 29న మరణించింది. యూపీ పోలీసులు ఆమె మృతదేహానికి రాత్రికి రాత్రే దహన సంస్కరాలు నిర్వహించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదీ చూడండి: 'హాథ్రస్' దర్యాప్తు ముమ్మరం- ఘటనా స్థలానికి సీబీఐ