Delhi Excise Policy : దిల్లీ ఎక్సైజ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాపై సీబీఐ అధికారులు మరోసారి దాడులు చేశారు. దిల్లీ సెక్రటేరియట్‌లోని సిసోదియా కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఈ విషయాన్ని మనీశ్ సిసోదియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "సీబీఐ అధికారులు మరోసారి నా కార్యాలయంపై దాడి చేశారు. నా లాకర్లో వెతికారు. నా స్వగ్రామంలో కూడా విచారించారు. కానీ వారికి ఏమీ దొరకవు. ఎందుకంటే నేను ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు. నేను దిల్లీ పిల్లలకు విద్యను అందించేందుకు పనిచేస్తున్నాను" అని ట్వీట్ చేశారు సిసోదియా.
'దాడులు చేయలేదు.. కేవలం పత్రాల కోసమే వచ్చాం'
మనీశ్ వ్యాఖ్యలపై స్పందించిన సీబీఐ అధికారులు.. తాము సిసోదియా కార్యాలయంపై ఎలాంటి దాడులు చేయలేదని స్పష్టం చేశారు. మద్యం పాలసీకి సంబంధించిన కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకునేందుకే వచ్చామని తెలిపారు.
2021 నవంబరులో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడం సహా విధానపరమైన లోపాలున్నట్లు దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. సీబీఐకి సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మనీశ్ సిసోదియా పాత్రనూ అందులో ప్రస్తావించారు. దిల్లీ ఎక్సైజ్ కుంభకోణం, మనీ లాండరింగ్ ఆరోపణలతో గతేడాది ఆగస్టులో.. పంజాబ్ నేషనల్ బ్యాంకులోని సిసోదియా లాకర్‌ను తనిఖీ చేశారు సీబీఐ అధికారులు. ఆయన నివాసం సహా దిల్లీలోని 21 ప్రాంతాల్లో దాడులు చేపట్టారు అధికారులు.
ఇవీ చదవండి: స్వస్థలంలో శరద్ యాదవ్ అంత్యక్రియలు.. మధ్యప్రదేశ్ సీఎం నివాళులు
ఆయుధాలతో ఇంట్లోకి ఏడుగురు దొంగలు.. స్మార్ట్‌ఫోన్‌తోనే చుక్కలు చూపించిన యజమాని