Caste Census Stay : బిహార్‌లో జరుగుతున్న కుల గణన, ఆర్థిక సర్వేపై పట్నా హైకోర్టు స్టే విధించింది. రాష్ట్రంలో జరుగుతున్న కుల గణనను తక్షణమే నిలిపివేయాలని.. ఇప్పటివరకు సేకరించిన సమాచారాన్ని భద్రంగా ఉంచాలని.. ఎవ్వరితోనూ పంచుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేవీ చంద్రన్, జస్టిస్ మధురేశ్ ప్రసాద్‌తో కూడిన డివిజన్ బెంచ్.. గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జులై 3 వరకు అమలులో ఉండనున్నాయి. ఈ కేసులో తదుపరి విచారణను జులై 7కు కోర్టు వాయిదా వేసింది. కుల గణనపై స్టే కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ బుధవారమే ముగియగా.. తీర్పును గురువారం వెల్లడించింది పట్నా హైకోర్టు.
Caste Census Patna High Court : "ఈ సర్వేలో సేకరించిన సమాచారం సమగ్రత, భద్రతకు సంబంధించిన ప్రశ్నలున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. కుల ఆధారిత సర్వేను నిర్వహించే అధికారం లేదని మేము అభిప్రాయపడుతున్నాము. ఇది జనాభా లెక్కల లానే ఉంది. యూనియన్ పార్లమెంట్ శాసనాధికారంపై ఇది ప్రభావం చూపుతుంది" అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
అంతకుముందు.. ఈ కేసులో పిటిషనర్ తరఫు న్యాయవాది దిను కుమార్.. ప్రధాన న్యాయమూర్తి కేవీ చంద్రన్ డివిజన్ బెంచ్ ముందు వాదనలు వినిపించారు. నీతీశ్ కుమార్ నేతృత్వంలో బిహార్ ప్రభుత్వం ప్రారంభించిన కుల గణన (Patna High Court Caste Based Survey) రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదని.. అయినా గణన నిర్వహిస్తున్నారని కోర్టుకు తెలిపారు. చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇలాంటి సర్వే నిర్వహించాలని చెప్పారు. ఈ గణనపై బిహార్ ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లను ఖర్చుచేసిందని కోర్టుకు నివేదించారు. దీంతో పాటు.. ఈ సర్వేలో 17 సామజిక ఆర్థిక సూచీల వివరాలు అడుగుతున్నారని.. అది జానాభా లెక్కల సేకరణలా ఉందని అన్నారు. కానీ, ఇలాంటి సర్వేలు చేపట్టే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని ఉద్ఘాటించారు.
ఈ వాదనలను బిహార్ తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ పీకే షాహి తోసిపుచ్చారు. ప్రజల ఆర్థిక స్థితుగతులు మెరుగుపర్చడం కోసం వారికి అవసరమైన సంక్షేమ పథకాలను రూపొందించేందుకు.. ఈ సర్వే అవసరమని కోర్టులో వాదించారు. అయితే, ఈ కుల గణన స్వచ్ఛందంగా జరిగిందని.. ప్రజుల ఇష్టముంటేనే సర్వేకు వివరాలు ఇవ్వొచ్చని.. జనాభా గణన లాగా తప్పనిసరి కాదని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు.
కుల గణన ద్వారా.. రాష్ట్రంలోని వివిధ కులాల వారి అభ్యున్నతికి పాటుపడేందుకు వీలుగా వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల గురించి సమాచారం అందుబాటులో వస్తుందన్న అంచనాతో బిహార్ ముఖమంత్రి సీఎం నీతీశ్ కుమార్ 7 జనవరి 2023న ఈ సర్వే ప్రారంభించారు. 2.9 కోట్ల కుటుంబాలోని 12.7 కోట్ల మంది వివరాలను ఆఫ్‌లైన్‌లో, మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో పొందుపర్చేందుకు బిహార్ ప్రభుత్వం ఈ గణన చేపట్టింది. అనంతరం దీన్ని వ్యతిరేకిస్తూ.. పట్నా హైకోర్టులో పటిషన్ దాఖలైంది. పటిషనర్ తరఫున దిను కుమార్, రితు రాజ్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అభినవ్ శ్రీవాత్సవ , శశి వాదించారు.