కరోనా.. మానవత్వాన్నే మరచిపోయేలా చేసింది! మానవ సంబంధాలకుండే విలువలను మార్చేసింది. కొవిడ్ వల్ల ఉద్యోగాలు కోల్పోయి చాలా మంది తమ సొంత తల్లిదండ్రులనే ఇంట్లో నుంచి బయటకు పంపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ తరహా ఘటనే మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో జరిగింది. కరోనాతో ఉపాధి కొల్పోయిన ఔరంగాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన తల్లిని పోషించలేనంటూ ఉత్తరం రాసి ఓ వృద్ధాశ్రమానికి పంపించాడు.

ఆ వృద్ధురాలికి ఒక్కడే కుమారుడు. అతను కోర్టులో పుస్తకాలు అమ్మేవాడు. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా కోర్టుకు ఎవరూ రాకపోవడం వల్ల వ్యాపారం దెబ్బతింది. దీంతో కుటుంబ పోషణ కష్టమైంది. దీనికి తోడు అప్పటికే అతని తల్లి, భార్యకు మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో అత్తకోడళ్ల మధ్య కలహాలు మరింత పెరిగాయి.

ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు కుటుంబ కలహాలను తట్టుకోలేక తల్లిని వృద్ధాశ్రమానికి పంపించాలని నిర్ణయించుకున్నాడు కుమారుడు. కొడుకు ఆర్థిక పరిస్థితి చూసి ఆ వృద్ధురాలు కూడా ఇందుకు అంగీకరించింది. దీంతో.. "నా తల్లిని పోషించలేను. మీరే మా అమ్మను జాగ్రత్తగా చూసుకోండి" అని ఉత్తరం రాసి ఔరంగాబాద్‌లోని మాతోశ్రీ వృద్ధాశ్రమానికి పంపించాడు ఆ వ్యక్తి.
అయితే, ఆ వృద్ధురాలికి అక్కడా ఇబ్బందులు తప్పలేదు. నిబంధనల ప్రకారం.. బంధువులు లేదా పోలీసులు మాత్రమే వృద్ధాశ్రమంలో చేర్చాలి. అలా జరగనందున ఆశ్రమం మేనేజర్ ఆ వృద్ధురాలిని చేర్చుకునేందుకు అంగీకరించలేదు.
ఆమె వెంటనే సమీపంలో పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. విషయాన్ని తెలియజేసింది. దీంతో ఆశ్రమంలో చోటు దొరికింది. ఆమె భర్త రెండో పెళ్లి చేసుకుని వెళ్లిపోగా.. ఇటు కొడుకు పోషించలేనని వదిలేసిన ఆ తల్లి బాధ వర్ణాతీతం. అయినా ఆ కొడుకుపై ఆమెకు మమకారం తగ్గలేదు. తన కొడుకు చాలా మంచివాడని, ప్రస్తుతం అతడి పరిస్థితి బాగాలేదని.. అన్ని సర్దుకున్నాక తనను మళ్లీ తీసుకెళ్తాడని చెబుతోంది.
ఇదీ చూడండి: Viral: స్ట్రాంగ్ ఉమెన్ స్టంట్స్- చీర కట్టులో జిమ్