Ration At Door Step : బంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం అమలు చేస్తున్న దువారే రేషన్ పథకం( ఇంటింటికీ రేషన్ పథకం) చట్టవిరుద్ధమని కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్ అనిరుద్ధ రాయ్, జస్టిస్ చిత్తరంజన్ సౌయర్‌తో కూడిన డివిజిన్ బెంచ్ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గతేడాది ఆగస్టులో రాష్ట్రంలోని రేషన్ డీలర్లలో ఒక వర్గం కలకత్తా హైకోర్టులో కేసు వేసింది. ఇంటింటికీ వెళ్లి రేషన్ పంపిణీ చేయడం సాధ్యం కాదనేది వారి వాదన. ప్రజల ఇళ్లకు రేషన్ సరఫరా చేయడానికి మౌలిక సదుపాయాలు లేవని డీలర్లు.. కోర్టులో వాదించారు. దిల్లీలోనూ ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించగా, కోర్టు ఆదేశాలతో రద్దు చేసిందని చెప్పారు. ఇంటింటికీ రేషన్ పథకం కేంద్ర చట్టానికి విరుద్ధమని డీలర్లు కోర్టుకు తెలియజేశారు.
అయితే డీలర్ల వాదనను జస్టిస్ అమృత సిన్హా తోసిపుచ్చారు. కరోనా పరిస్థితుల్లో ప్రజలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులపై డీలర్లు అపీలుకు వెళ్లారు. విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ రాయ్, జస్టిస్ చిత్తరంజన్ సౌయర్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఇంటింటికీ రేషన్ పథకం చట్ట విరుద్ధమని తీర్పునిచ్చింది.
"ఇంటింటికీ రేషన్ పథకం కేంద్ర ఆహార భద్రతా చట్టానికి విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును బలవంతంగా నడుపుతోంది. కొన్నిసార్లు డీలర్లను బెదిరించి, జరిమానా విధించి మరీ ఇంటింటికి రేషన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈరోజు ఆ పథకం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది" అని పిటిషనర్ షేక్ అబ్దుల్ మజీద్ తెలిపారు.
ఇవీ చదవండి: 'క్రిమినల్' నేతలకు చెక్.. ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం?.. కేంద్రానికి నోటీసులు
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరు అరెస్టు.. ఈడీ వలలో మహేంద్రు