అసెంబ్లీ ఎన్నికల అనంతర హింసపై దాఖలైన కేసులో మమతా బెనర్జీ సర్కారుకు సోమవారం.. న్యాయస్థానంలో చుక్కెదురైంది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ ప్రభుత్వం చేసిన వినతిని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.
రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలన్నింటిపై జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)తో అధ్యయనం చేయించాలని హైకోర్టు గతంలో ఉత్తర్వులిచ్చింది. వీటిని ఉపసంహరించాలంటూ తృణమూల్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. కానీ.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ బిందాల్ సారథ్యంలోని ధర్మాసనం అందుకు నిరాకరించింది. బెంగాల్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి నివేదిక ఆధారంగా హైకోర్టు తన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులన్నింటినీ పరిశీలించాల్సిందిగా ఎన్హెచ్ఆర్సీకి సూచించింది.
ఈనేపథ్యంలో హింసాత్మక సంఘటనలపై విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ సోమవారం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుడు రాజీవ్‌జైన్ సారథ్యం వహించే ఈ కమిటీ తక్షణమే పని ఆరంభించింది. ఇప్పటికే వచ్చిన ఫిర్యాదులతోపాటు తాజా ఫిర్యాదులనూ కమిటీ విచారిస్తుంది.
ఇదీ చూడండి: బంగాల్ హింసపై సీజేఐకి మహిళా న్యాయవాదుల లేఖ