CAG Report On Railways Safety : ఒడిశా ఘోర రైలు ప్రమాదం తర్వాత రైల్వే భద్రతపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే పరిస్థితులపై కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్- కాగ్.. 2022లో పార్లమెంటుకు సమర్పించిన నివేదికపై చర్చ మొదలైంది. రైల్వే తనిఖీల్లో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు వెల్లడించింది. ప్రమాదాల తర్వాత విచారణ నివేదికలను పట్టించుకోవడంలో వైఫల్యం, భద్రతా అవసరాలకు రైల్వే నిధిని ఉపయోగించకపోవడం, ట్రాక్ పునరుద్ధరణకు నిధుల కొరత, భద్రతా కార్యకలాపాల్లో సిబ్బంది కొరత ఉన్నట్లు.. కాగ్ వెల్లడించింది. ట్రాక్‌ల రేఖాగణిత, నిర్మాణ పరిస్థితులను అంచనా వేయడానికి అవసరమైన రికార్డింగ్ కార్ల తనిఖీల్లో 30 నుంచి 100 శాతం లోపాలున్నట్లు హెచ్చరించింది. ట్రాక్‌ల నిర్వహణను పరిశీలించే ట్రాక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పనితీరుపై కూడా కాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
2017 ఏప్రిల్ నుంచి 2021 మార్చ్ వరకు రైలు పట్టాలు తప్పిన ప్రమాదాల్లో 422 ఇంజినీరింగ్ శాఖ లోపాల వల్ల జరిగినట్లు కాగ్ వెల్లడించింది. ట్రాక్‌ల నిర్వహణ లోపాలతో 171, పరిమితికి మించిన ట్రాక్‌ల వల్ల 156 ప్రమాదాలు జరిగినట్లు పేర్కొంది. నిర్లక్ష్య డ్రైవింగ్, అతి వేగం కూడా పట్టాలు తప్పడానికి కారణమని తెలిపింది. ఆపరేటింగ్ డిపార్ట్‌మెంట్‌లోని లోపాల వల్ల 275 ప్రమాదాలు జరిగినట్లు కాగ్ నివేదిక బయటపెట్టింది. రూల్ ప్రొసిజర్ ఆర్డర్లను పాటించకపోవటం, సిబ్బందికి కౌన్సిలింగ్ ఇవ్వకపోవడం, రైళ్ల కార్యకలాపాలపై పర్యవేక్షణ లేకపోవటం, సమాచార లోపం, షెడ్యూల్డ్ తనిఖీలు ప్రమాదాలకు కారణమవుతున్నట్లు కాగ్.. గతేడాది తన నివేదికలో నిగ్గు తేల్చింది.
ప్రాధాన్యం ఇవ్వాల్సిన పనులను పట్టించుకోకపోవడం, అవసరంలేని పనులకు నిధులు వెచ్చించడం వంటివి రైల్వేల్లో జరుగుతున్నట్లు కాగ్ వెల్లడించింది. రిజర్వ్ ఫండ్ అయిన రాష్ట్రీయ రైల్ సంరక్ష కోశ్ నుంచి ట్రాక్‌ల పునరుద్ధరణ, భద్రతాపనుల కోసం వెచ్చించాల్సిన ఖర్చు గత ఐదేళ్లలో భారీగా తగ్గిందని కాగ్ ఎండగట్టింది. 2017-2021 మధ్య జరిగిన 1,127 పట్టాలు తప్పిన ఘటనల్లో 26శాతం ట్రాక్ పునరుద్ధరణ లోపం వల్లే జరిగినట్లు కాగ్ తెలిపింది.
2018-21 మధ్య దాదాపు 3వేల మానవ రహిత లెవల్ క్రాసింగ్‌లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యం నెరవేరలేదనీ.. కేవలం 2వేల 59 మానవ రహిత లెవల్ క్రాసింగ్‌లు మాత్రమే ఏర్పాటైనట్లు వివరించింది. అతిముఖ్యంగా ఫూల్ ప్రూఫ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని కాగ్ పేర్కొంది. కాగా శుక్రవారం రాత్రి జరిగిన ఒడిశా రైలు ప్రమాదంలో 275 మంది మరణించారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే గతం కాగ్ ఇచ్చిన నివేదిక చర్చనీయాంశంగా మారింది.