Cafe Positive Run By HIV People In Kolkata : బంగాల్లోని సౌత్ కోల్‌కతాలో 'కేఫ్ పాజిటివ్' అనే కాఫీ షాప్‌ను నడుపుతున్నారు 14మంది టీనేజర్లు. అయితే వారంతా హెచ్ఐవీ ఉన్నవాళ్లే. సమాజంలో హెచ్ఐవీపై ఉన్న ప్రతికూల ఆలోచనలను తొలగించే లక్ష్యంతోనే ఈ కేఫ్‌ను 'కాఫీ బిహైండ్ బౌండరీస్' అనే ట్యాగ్‌లైన్‌తో ప్రారంభించారు సామాజిక కార్యకర్త కల్లోల్ ఘోష్.
"నా స్నేహితుడు సాయంతో నేను జోధ్‌పుర్ పార్క్‌లో ఒక చిన్న గ్యారేజ్‌ని లీజ్‌కి తీసుకుని ప్రారంభించాను. అప్పుడు మంచి స్పందన వచ్చింది. 64ఏ లేక్ వ్యూ రోడ్డు వద్ద గత మూడున్నర ఏళ్లుగా 'కేఫ్ పాజిటివ్'ని విజయవంతంగా నడుపుతున్నాం."
-కల్లోల్ ఘోష్, కేఫ్ పాజిటివ్ వ్యవస్థాపకుడు
హెచ్ఐవీ ఉన్న వ్యక్తులకు అవగాహన పెంపొందించటమే కాకుండా.. వాళ్లకు ఉపాధిని కల్పించటమే కేఫ్ పాజిటివ్ ప్రధాన లక్ష్యం.
"నేను హాస్టల్లో ఉన్నప్పుడు నాలుగు గోడల మధ్యే ఉన్నాను. ఇప్పుడు ఈ కేఫ్‌లో మంచి చేయటం సంతోషంగా ఉంది. ఈ కేఫ్ వల్ల హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులపై ఉన్న ఆలోచన విధానంలో మార్పులు వచ్చాయి. కేఫ్‌కి వచ్చిన వాళ్లకి నేనే ఫుడ్‌ను అందిస్తున్నాను. వాళ్లు కూడా మంచిగా స్పందిస్తున్నారు."
-కేఫ్ వర్కర్
విద్యార్థులు, ప్రముఖులు కేఫ్‌కు..
ఈ కేఫ్‌కు విద్యార్థులు, నగరానికి చెందిన కొంతమంది ప్రముఖులు తరచుగా వస్తుంటారు. "చాలా మంది హెచ్ఐవీ, ఎయిడ్స్ అనేవి ఒకటే అనుకుంటారు. కానీ ఆ రెండు వేరు. హెచ్ఐవీ అనేది ఒక వైరస్. ఎయిడ్స్ అనేది ఇన్ఫెక్షన్. హెచ్ఐవీ రోగులు అందరూ ఎయిడ్స్ రోగులు కారు. సాధారణంగా ఒక వ్యక్తికి షుగర్ లేదా బీపీ వచ్చినప్పుడు మందులు తీసుకుంటున్నారు. అలానే హెచ్ఐవీ ఉన్నవాళ్లు కూడా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి మందులు తీసుకోవాలి." అని కేఫ్ పాజిటివ్ వ్యవస్థాపకుడు కల్లోల్ ఘోష్ తెలిపారు. అలానే ప్రస్తుతం సమాజంలో హెచ్ఐవీ సోకిన వ్యక్తుల పట్ల ఉన్న ప్రతికూల ఆలోచనలను అధిగమించడానికి ఈ కేఫ్ సహాయపడుతుందని అంటున్నారు సామాజిక కార్యకర్త కల్లోల్ ఘోష్.