Bundi king Army officer: భారత సైన్యం స్పెషల్ ఫోర్సెస్‌కు చెందిన అధికారి బ్రిగేడియర్ భూపేశ్ సింగ్ హాడా.. రాజస్థాన్, బుందీలోని హాడా రాజ్‌పుత్ సంస్థానానికి మహారాజుగా బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం ఆయనకు పట్టాభిషేకం నిర్వహించారు.
Rajputh king Bhupesh Singh Hada
పాగ్ కి దస్తూర్ అనే సంప్రదాయ ప్రక్రియ ద్వారా హాడా రాజ్‌పుత్ వర్గానికి నూతన అధిపతిగా భూపేశ్ సింగ్‌ను ఎంపిక చేసినట్లు కమిటీ ప్రతినిధి అరిహంత్ సింగ్ తెలిపారు. ఒకప్పటి సంస్థానమైన బుందీలో ఉన్న జాగిర్దార్లు, ఠికానేదార్ల అభిప్రాయాన్ని సేకరించి కొత్త మహారాజు పేరును ఖరారు చేసినట్లు చెప్పారు. 118 మంది జాగిర్దార్లు, ఠికానేదార్లలో 108 మంది భూపేశ్‌కు మద్దతు ప్రకటించారని వివరించారు.
Army Officer as Rajputh king
ఆదివారం సంప్రదాయాలను అనుసరించి భూపేశ్ పట్టాభిషేక కార్యక్రమాలు పూర్తి చేసేశారు. అనంతరం ఊరేగింపు నిర్వహించారు. తనను ఈ హోదాకు ఎంపిక చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు భూపేశ్. ప్రస్తుతం.. కేంద్ర సాయుధ దళమైన నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ)లో పనిచేస్తున్నారు.
"సుదీర్ఘ కాలంగా బుందీ మహారాజు సీటు ఖాళీగా ఉంది. సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది. పాగ్‌కు నేతృత్వం వహించే యోగ్యత ఉందని భావించి నాకు ఈ బాధ్యతలు అప్పగించిన వారందరికీ ధన్యవాదాలు. సంప్రదాయాలను కాపాడటమే నా కర్తవ్యంగా భావిస్తా."
-బ్రిగేడియర్ భూపేశ్ హాడా
అయితే, మరోవర్గం మాత్రం కాప్రెన్ రాజకుటుంబానికి చెందిన వంశ్వర్ధన్ సింగ్ హాడాను మహారాజుగా ఎంపిక చేస్తూ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈ విషయం వివాదానికి దారితీసినట్లైంది.
నామమాత్ర మహారాజు
2010 లో బుందీ సంస్థానాధిపతి కన్నుమూశారు. ఆయనకు వారసులు లేకపోవడం వల్ల.. కొత్త మహారాజును ఎంపిక చేయడం అనివార్యమైంది. ఈ మేరకు హాడా రాజ్‌పుత్ వర్గాలు.. 'పాగ్ కమిటీ'ని నియమించాయి. అందరి అభిప్రాయాలను తీసుకొని కొత్త మహారాజును ఎంపిక చేసింది ఈ కమిటీ. అయితే, మహారాజు కేవలం నామమాత్రపు హోదానే అనుభవిస్తారు. ఆయనకు ఎలాంటి అధికారాలు ఉండవు.
బుందీ రాయల్ ఫ్యామిలీ ఆస్తులన్నీ అల్వార్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత భన్వార్ జితేంద్ర పేరు మీద ఉన్నాయి. బుందీ రాజకుటుంబంలో ఆయన సభ్యుడు. అయితే, తాజా వార్తలపై జితేంద్ర సింగ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదీ చదవండి: 'రక్తదానం చేసిన వారికి 2కిలోల చికెన్, అరకిలో పనీర్'