Bullock cart library: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లింది. ఈ క్రమంలో పిల్లలు చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో సరికొత్త ఆలోచన చేశారు మధ్యప్రదేశ్ బెతుల్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు కమలా దవండే. 'ఎద్దుల బండి లైబ్రరీ'కి శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ వెళ్లి.. పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. విద్యార్థుల ఇళ్ల వద్దే 'మొహల్లా పద్ధతి'లో పాఠాలు బోధిస్తున్నారు.


సరైన సాంకేతిక సదుపాయాలు లేక.. భౌంసదేహీ ప్రాంతంలో మారుమూల గ్రామానికి చెందిన పిల్లలు ఆన్లైన్ తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. దీంతో ఆ గ్రామంలోని పాఠశాలలో పని చేస్తున్న కమల.. వినూత్నంగా ఆలోచించి ఎద్దుల బండిని లైబ్రరీగా మార్చారు. ఆ బండిలో పుస్తకాలు వెసుకుని ఇంటింటికీ వెళ్లి.. విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. తమ ఇంటి ముందుకు లైబ్రరీ వచ్చిందని పిల్లలకు తెలియజేసేలా.. బండి వెనకాల వెళ్లే కొందరు విద్యార్థులు ప్లేట్‌పై కర్రతో కొడతాడు. దీంతో విద్యార్థులు ఆ బండి వద్దకు వెళ్లి.. తమకు కావాల్సిన పుస్తకాలు తీసుకుంటారు.


"ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో పిల్లలు కూడా తల్లిదండ్రులతో పాటు పనులకు వెళ్లే దయనీయ స్థితి ఉండేది. కానీ నేను వెళ్లాక ఆ పరిస్థితి కొంత వరకు మెరుగుపడింది. కొవిడ్ సమయంలో వారి చదువులకు అంతరాయం కలగకుండా సంచాలిత మొహల్లా క్లాసులు ఏర్పాటు చేశాను. ఎద్దుల బండినే లైబ్రరీగా మార్చి ఇంటింటికీ పుస్తకాలను పంపిణీ చేస్తున్నాను."
- కమలా దవండే ఉపాధ్యాయురాలు
పిల్లలు చదువుకోవాలనే తాపత్రయంతో కమల చేసే గొప్ప ప్రయత్నానాన్ని నెటిజన్లు సహా.. స్థానిక అధికారులు ప్రశంసిస్తున్నారు.

ఇదీ చూడండి: విద్యార్థుల దగ్గరకే పాఠాలు- బైకు మీద క్లాసులు