సరిహద్దు భద్రత దళం(బీఎస్‌ఎఫ్)(Bsf Latest News) అధికార పరిధిని విస్తృతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మన దేశ సరిహద్దుల వెంట రక్షణ విధులు నిర్వహించే ఈ దళం ఇకపై పంజాబ్, బంగాల్, అసోం రాష్ట్రాలలో 50 కి.మీ.వరకు లోపలకు వచ్చి సోదాలు, జప్తులు చేయడం సహా అనుమానిత వ్యక్తులను అరెస్టు చేయవచ్చు. ఈ మూడు రాష్ట్రాలలో ఈ పరిధి ఇప్పటి వరకూ 15 కి.మీ. వరకే ఉండేది. బీఎస్‌ఎఫ్(Bsf Latest News) చట్టంలో 2014 జులైలో పొందుపరిచిన నిబంధనలకు కేంద్ర హోంశాఖ ఈ మేరకు సవరణలు చేసింది.
పాకిస్థాన్‌తో సరిహద్దులు కలిగిన గుజరాత్‌లో బీఎస్‌ఎఫ్(Bsf Latest News) సిబ్బంది సోదాలు నిర్వహించే ప్రాంత పరిధిని 80 కి.మీ. నుంచి 50 కి.మీ.దూరానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. రాజస్థాన్‌లో మాత్రం 50 కి.మీ. పరిధిని యథాతథంగానే ఉంచింది. పంజాబ్, రాజస్థాన్‌లు కూడా పాకిస్థాన్‌తో సరిహద్దులను కలిగి ఉన్నాయి. అసోం మాత్రం బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లతో మనదేశానికున్న సరిహద్దుల వెంట 6,300 శిబిరాల వద్ద 2.65 లక్షల మంది బీఎస్‌ఎఫ్ జవాన్లు విధులు నిర్వహిస్తున్నారు. తాజా సవరణ వల్ల సరిహద్దు వెంట జరిగే నేరాలను మరింత సమర్థంగా నిలువరించడానికి వీలవుతుందని బీఎస్‌ఎఫ్ అధికారులు అభిప్రాయపడ్డారు. సరిహద్దు రాష్ట్రాలన్నిటిలోనూ ఏకరూప విధానం అమలులోకి వస్తుందని తెలిపారు.
వ్యతిరేకించిన పంజాబ్ సీఎం
బీఎస్‌ఎఫ్ సోదాల పరిధిని విస్తరించడంపై పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ చర్యను సమాఖ్య వ్యవస్థపై దాడిగా అభివర్ణించారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరుతున్నట్లు ట్వీట్ చేశారు.
శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కూడా కేంద్ర ప్రభుత్వ చర్యను తప్పుపట్టారు. పంజాబ్‌లో కేంద్ర ప్రభుత్వం పరోక్ష పాలన సాగించబోతుందని ఆక్షేపించారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాత్రం కేంద్ర ప్రభుత్వ చర్యను సమర్థించారు. బీఎస్‌ఎఫ్ అధికార పరిధి పెంపు మన దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. రాజకీయాల్లోకి సైనిక దళాలను లాగడం సరికాదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'సరిహద్దు రక్షణలో బీఎస్‌ఎఫ్ పాత్ర ఎనలేనిది'
ఇదీ చూడండి: Venkaiah Naidu: 'దేశాన్ని అస్థిరపరిచే కుట్రలను తిప్పికొట్టాలి'