Delhi Liquor Scam Updates: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా కవితను విచారించిన ఈడీ అధికారులు.. సుమారు 10 గంటల పాటు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం రేపు ఉదయం 11 గంటలకు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద ఈడీ అధికారులు కవితను విచారించారు. ఉదయం కవిత వెంట భర్త అనిల్, న్యాయవాది భరత్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కవిత విచారణ కొనసాగుతుండగానే సాయంత్రం తెలంగాణ అదనపు ఏజీ ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
దిల్లీ, హైదరాబాద్ సమావేశాల్లో చర్చించిన అంశాలపై ఈడీ అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. మనీలాండరింగ్ కేసులో అనుమానితురాలిగా కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సౌత్ గ్రూప్ నుంచి కవిత కీలక వ్యక్తిగా ఈడీ పేర్కొంది. బ్యాంక్ స్టేట్‌మెంట్ సహా మిగిలిన డాక్యుమెంట్లను కవిత వారికి అందించారు.
ఇక కవిత ఈ నెల 16వ తేదీన ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే తన ప్రతినిధి న్యాయవాది భరత్‌ను మాత్రమే ఈడీ ఆఫీస్‌కు పంపారు. తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారించనుందని.. ఈ నేపథ్యంలో తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు వేచి చూడాలని ఈడీకి లేఖ పంపారు. కానీ ఈడీ మాత్రం ఆమెకు 20న హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె ఈరోజు ఈడీ ముంగిట హాజరయ్యారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, అరుణ్ రామచంద్రపిళ్లైలతో కలిపి కవితను విచారించినట్లు సమాచారం.
సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్..: విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంను ఆశ్రయించారు. ఒక మహిళను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు కవిత. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ అలా చేయలేదని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకు విన్నవించారు. ఆమె పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది సీజేఐ ధర్మాసనం. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. అదే విధంగా ఈ నెల 24న వాదనలు వింటామని సీజేఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో ఈ నెల 16న ఈడీ విచారణకు కవిత హాజరు కాలేదని తెలుస్తోంది.
ఇవీ చదవండి: