Telangana HC on BRS MLA Vanama Election : కొత్తగూడం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను హైకోర్టు కొట్టివేసింది. వనమా ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు.. ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. వనమాకు రూ.5 లక్షల రూపాయల పెనాల్టీ విధించింది. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు.. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా జలగం వెంకట్రావు పోటీ చేశారు.
అయితే వనమా ఎన్నికను సవాల్ చేస్తూ 2019లో జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని ఆస్తుల వివరాలు ప్రస్తావించకుండా తప్పుడు ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారని జలగం వెంకట్రావు వాదన. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి ఇవాళ తీర్పు వెల్లడించారు. జలగం వాదనలతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం.. వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని ప్రకటించింది. ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన వనమా వెంకటేశ్వరరావు.. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడూ హాట్ టాఫిక్‌గా నిలిచే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి ఎన్నికలకు ముందే అక్కడ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఖమ్మం మెట్టు నుంచే తమ ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నాయి. ఇటీవలే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో అక్కడి రాజకీయాలు మరింత కాకరేపుతున్నాయి. తాజాగా హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షాలు అధికార పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ జనాకర్షణ పొందే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ కోసం బీఆర్‌ఎస్‌లో నేతల మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. తాజాగా వనమాపై హైకోర్టు వేటుతో జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా ఎన్నిక కానున్నారు. బుధవారం రోజున జలగం కొత్తగూడెం ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఎన్నికల గడువు మూడు నెలలు మాత్రమే ఉండగా ఆ తదుపరి బీఆర్ఎస్ టికెట్ ఎవరికి కేటాయిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే వృద్ధాప్యం, వనమాపై హైకోర్టు వేటుతో ఆయనకు టికెట్ అవకాశాలు అంతంతమాత్రంగానే చెప్పుకోవచ్చు. ఆయనకు కాకుండా వనమా కుమారుడు రాఘవకు ఇచ్చే అవకాశాలున్నాయంటే అది కూడా చాలా తక్కువ ఉన్నట్లుగానే సమాచారం. ఎందుకంటే.. గత సంవత్సరం జనవరిలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు ఘటనలో రాఘవ ఏ-2గా ఉన్నారు. అలాగే అతనిపై పలు కేసులు ఉండడంతో రాఘవకు టికెట్ రావడం కష్టంగానే చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉంటే మరోవైపు డీహెచ్ గడల శ్రీనివాస్‌రావు కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నట్లు సమాచారం. తరచూగా వనమా వెంకటేశ్వర రావుపై పరోక్షంగా విమర్శలు గుప్పించడం ఇటీవల చూశాం. గత ఎన్నికల్లో ఇదే చివరి పోటీ అని చెప్పిన స్థానిక శాసనసభ్యులు ఇక విశ్రాంతి తీసుకోవాలని డీహెచ్ సూచించారు. లాస్ట్ ఛాన్స్ అంటూ.. ఇంకెన్ని ఛాన్స్‌లు అడుగుతారంటూ విమర్శించారు. ఈ క్రమంలోనే తన సమావేశానికి వచ్చే వారిని బెదిరిస్తున్నారని.. ప్రభుత్వ పథకాలు, దళిత బంధు వంటివి అందకుండా చేస్తామంటున్నారని ఆరోపించారు. ఇలాంటి తీరుకు ఎవరూ భయపడొద్దని సూచించారు. తనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారా అని కార్యక్రమానికి వచ్చిన వారిని డీహెచ్ గడల శ్రీనివాస్‌రావు ప్రశ్నించారు. తాజాగా హైకోర్టు తీర్పుతో కొత్తగూడెం బీఆర్ఎస్ టికెట్ ఎవరికనే దానిపై రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి :