1857 నాటి తొలి స్వాతంత్య్ర యుద్ధంలో సిపాయిలతో పాటు అనేక ఆదివాసీ తెగలు కూడా తెల్లవారిపై తిరుగుబాటు చేశాయి. అవంతిబాయి లోధి, ధన్‌సింగ్ గుర్జార్‌లాంటి ఆదివాసీ నేతలు తమకు సహకరించకుండా తిరుగుబాటుకు తోడ్పాటునందించటం బ్రిటిష్‌వారికి ఆందోళన కలిగించింది. 1857 తర్వాత సాధ్యమైనంతగా భారతీయ సమాజాన్ని మతాలు, కులాలు, జాతులు, స్థాయులుగా వర్గీకరించి... వాటిని విభజించటంపై దృష్టిసారించింది బ్రిటిష్ ప్రభుత్వం.
నేరాలూ వారసత్వంగానే అంటూ...
ఎలాంటి స్థిరమైన పనులు చేయనివారిని, తమ యూరోపియన్ దృష్టిలో దేశదిమ్మరులుగా భావించిన వారిని, తమకు అర్థంగాని సంచార జాతులతో పాటు అనేక ఆదివాసీ తెగలను నేర జాతులు, కులాలుగా వర్గీకరించింది. 1871లో ఈ మేరకు నేరజాతుల చట్టం(Criminal tribes act) ప్రవేశపెట్టినప్పుడు... "భారత సమాజంలో చాలామంది చేనేత పనులను, వ్యవసాయ, వడ్రంగి పనులను వంశపారంపర్యంగా చేస్తూ వస్తున్నారు. కాబట్టి కొన్ని జాతులు, కులాల్లోని వారు నేరాలను వారసత్వంగా, వృత్తిగా తీసుకొని ఉంటారు" అని బ్రిటిష్ ప్రభుత్వం సమర్థించుకుంది. చామర్లు, లోధీలు, గుజ్జార్లలాంటి అనేక శాఖలతో పాటు హిజ్రాలు, సాధుసంతులు, ఫకీర్లు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ఒక్క బంగాల్‌లోనే 237 నేర జాతులుగా కులాలను ప్రకటించారు.
అత్యంత అమానుషమైన ఈ చట్టాన్ని(Criminal tribes act) సంస్కరణ పథంగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. తొలుత ఉత్తర భారతంలో ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని.. 1876లో బంగాల్‌కు, మద్రాసు రాష్ట్రానికీ అనువర్తింపజేశారు. స్వాతంత్య్రం నాటికి కోట్ల మంది... ఈ చట్టం కింద అరెస్టును ఎదుర్కొనే పరిస్థితి. స్వాతంత్య్రానంతరం 1949లో ఈ చట్టాన్ని ఎత్తేశారు. తద్వారా ఈ జాతులన్నింటికీ విముక్తి లభించింది.
నేరాలు చేసినా, చేయకున్నా నేరగాళ్లే..
ఈ జాబితాలోని వారు ఎక్కడికంటే అక్కడికి స్వేచ్ఛగా వెళ్లటానికి వీల్లేదు. అందరితోనూ కలవటానికి వీల్లేదు. వారంవారం, లేదా నెలకోసారి వచ్చి పోలీసుల వద్ద సంతకాలు చేసి వెళ్లాలి. ఎక్కడికైనా వెళ్లాలంటే అనుమతి, పాస్‌లు తీసుకోవాలి. నేరాలు చేసినా, చేయకున్నా ఈ కులాలు, జాతులవారంతా నేరగాళ్లే. వీరిని ఎలాంటి విచారణ లేకుండానే అరెస్టు చేసేవారు. జైల్లో పెట్టేవారు. వీరిపై నిరంతరం నిఘా ఉండేది. వేరే బ్రిటిష్ వలస ప్రాంతాలకు పంపించేవారు. అంతేగాదు... ఈ కులాల్లో పుట్టేవారంతా పుట్టుకతోనే నేరస్థుల కింద లెక్క. కాబట్టి పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరు చేసేవారు.
ఇవీ చూడండి:
- Azadi Ka Amrit Mahotsav: భారత సిపాయిలపై బ్రిటన్ 'నాజీయిజం'
- Azadi Ka Amrit Mahotsav: ఎనిమిదో ఏటే జెండా పట్టి.. రహస్య రేడియో పెట్టి..
- Azadi ka amrit mahotsav: గాంధీకి దారి చూపి.. అల్లర్లలో అసువులు బాసి..
- ఆంగ్లం వద్దు.. అమ్మభాషే మేలు- తగువులాడుకున్న తెల్లవారు
- Azadi Ka Amrit Mahotsav: ముందే స్వాతంత్య్రం ప్రకటించుకొని..
- ఆంగ్లేయులను ఓడించి.. స్వదేశీ ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చి..