తమ బిడ్డకు చనుబాలు(Breast feeding) ఇచ్చేందుకు కన్న తల్లికి సంపూర్ణ హక్కు ఉంటుందని, వారికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 పూర్తి రక్షణ కల్పిస్తోందని స్పష్టం చేసింది కర్ణాటక హైకోర్టు(karnataka high court ). ఓ చిన్నారి పెంపకంలో.. పెంపుడు తల్లి, కన్న తల్లి మధ్య వివాదంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది జస్టిస్ క్రిష్ణ ఎస్ దీక్షిత్‌ల ఏకసభ్య ధర్మాసనం.
"దేశ చట్టాలు, అంతర్జాతీయ చట్టాల ప్రకారమైనా.. బిడ్డకు చనుబాలివ్వడం కన్న తల్లికి సంపూర్ణ హక్కుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే బిడ్డ చనుబాలు తాగే హక్కు.. తల్లి హక్కుతో కలిసిపోవాలి. మాతృత్వంలోని ఈ ముఖ్యమైన లక్షణానికి.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా వచ్చే ప్రాథమిక హక్కుల గొడుగు కింద రక్షణ ఉంటుంది."
- ధర్మాసనం.
చిన్నారిని కన్న తల్లికి తిరిగి ఇచ్చేయాలని పెంపుడు తల్లిని ఆదేశించింది ధర్మాసనం. చనుబాలు తాగకుండా కన్న తల్లి నుంచి బిడ్డను వేరుచేయటం దురదృష్టకరమని పేర్కొంది. పౌర సమాజంలో అలాంటి ఘటనలు జరగకూడదని అభిప్రాయపడింది.
అయితే.. కన్న తల్లికి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని, పెంపుడు తల్లికి బిడ్డలు లేనందున ఆమెనే చిన్నారిని బాగా చూసుకోగలదని ప్రాసిక్యూటర్ వాదించారు. బిడ్డను పెంపుడు తల్లికే అప్పగించాలని అభ్యర్థించారు. కానీ, ప్యాసిక్యూటర్ వాదనలు తిరస్కరించింది ధర్మాసనం.
ఇదీ చూడండి: Breast feeding: ఈ అమ్మలు అమృతం పంచుతున్నారు!