ఒకప్పుడు ఆమెను అపహాస్యం చేసిన నోళ్లే ఇప్పుడు ప్రశంసలతో ముంచెత్తున్నాయి. గతంలో ఆమెను హేళన చేసిన వారే ఇప్పుడు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. తోటి విద్యార్థులు ఎగతాళి చేస్తున్నారని స్కూల్ మానేసిన ఓ దివ్యాంగురాలు.. 24 ఏళ్లకు లాయర్‌గా మారి అందరీ మన్ననలు పొందుతున్నారు. 3 అడుగుల 11 అంగుళాల ఎత్తున్న ఆమె పంజాబ్‌కు చెందిన హర్విందర్ కౌర్ అలియాస్ రూబి.
పదేళ్ల వరకు రూబీ జీవితం సాఫీగానే సాగింది. తోటి పిల్లలతో కలిసి సరదాగా ఉండేది. ఎత్తు పెరగకపోవడం వల్ల తను ఇతరుల్లా కాదని ఆమెకు అప్పుడే అర్థమైంది. ఇతరులు తనను చిన్నచూపు చూడటం భరించలేకపోయింది. దీంతో పాఠశాలపై ద్వేషం పెరిగి ఇంటికే పరిమితమైంది. తన శక్తిసామర్థ్యాలపై తనకే విశ్వాసం సన్నగిల్లింది. కానీ ఎదైనా సాధించాలనే సంకల్పంతో లాయర్ కావాలని నిర్ణయించుకుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది.
తాను మొదట ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్నానని, కానీ అది సాధ్యం కాదని తెలిసి లాయర్ అవ్వాలనుకున్నట్లు రూబి చెప్పారు. తమ ఇంట్లో అందరూ సాధారణ ఎత్తే ఉంటారని తెలిపారు. కేవలం లా పూర్తి చేయడమే కాకుండా, అందరి మనసులు గెలుచుకోవాలని తాను అనుకున్నట్లు వివరించారు. లాయర్ అయ్యాక అందరూ తనను గౌరవిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
జలంధర్ రామ మండిలోని అర్మాన్ నగర్లో నివసించే రూబి.. ప్రస్తుతం జిల్లా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జగ్పాల్ సింగ్ వద్ద లా ప్రాక్టీస్ చేస్తున్నారు. దివ్యాంగులందరి తరఫున కోర్టులో ఉచితంగా వాదిస్తానని చెబుతున్నారు.