అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 27 నుంచి రెండు రోజుల పాటు భారత్‌ను సందర్శించనున్నట్లు అధికార వర్గాలు తెలిపారు. దీనిలో భాగంగా అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణతో చోటుచేసుకున్న పరిణామాలు, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేయకుండా, వారికి స్థావరం కల్పించకుండా పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచడం, ఇండో-పసిఫిక్ సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశముందని పేర్కొన్నాయి.
విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా భారత్‌లో పర్యటించనున్న బ్లింకెన్.. పెట్టుబడులు, ఆరోగ్యం, విద్య, భద్రతపై చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల పౌరుల ప్రయోజనం కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ చర్చలు జరగనున్నాయి.
ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ మందగమనం, కరోనా నియంత్రణకు సాయం, భద్రత అంశాలపై ఇరుపక్షాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయని అధికార వర్గాలు తెలిపాయి. దీంతోపాటు ఈ ఏడాది చివరిలో జరగబోయే క్యాడ్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఆ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చలు జరపనున్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అంశాలపైనా మాట్లాడనున్నారు.
ఇదీ చూడండి: 'నేషన్ ఫస్ట్.. ఆల్వేస్ ఫస్ట్' మంత్రంతో ముందుకు'