రాజ్యసభలో అధికార పక్షనేతగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఎంపికయ్యారు. ఈ మేరకు జులై 19నుంచి జరిగే వర్షాకాల సమావేశాల నుంచి రాజ్యసభలో భాజపా నాయకుడిగా ఆయన వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ.. రాజ్యసభ సెక్రెటేరియట్‌కు తెలియజేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అంతకుముందు వరకు ఆ స్థానంలో ఉన్న థావర్‌చంద్ గహ్లోట్ ఇటీవల కర్ణాటక గవర్నర్‌గా నియమితులయ్యారు. ఫలితంగా రాజ్యసభ పక్షనేత బాధ్యతను భాజపా అధిష్ఠానం పీయూష్ గోయల్‌కు అప్పగించింది.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇటీవలే గోయల్‌కు.. వినియోగదారుల వ్యవహారాలు; ఆహార పంపిణీ; జౌళి శాఖలను కేటాయించారు ప్రధాని మోదీ. ఆయన ఇప్పటికే కేంద్ర వాణిజ్య శాఖ బాధ్యతలను చూసుకుంటున్నారు. రాజ్యసభకు రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న గోయల్.. ప్రస్తుతం ఎన్డీఏ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2014లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు భాజపా కోశాధికారిగా పనిచేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చురుగ్గా పనిచేశారు.
ఇదీ చదవండి: వరకట్నానికి వ్యతిరేకంగా గవర్నర్ నిరాహార దీక్ష