Salman Kurshid Comments On BJP: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల విషయంలో భాజపా ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆ పార్టీ తన ఎన్నికల విజయాన్ని దేశాన్ని దోచుకోవడానికి లైసెన్స్‌గా ఉపయోగిస్తోందని ఆరోపించారు. ప్రతిరోజు ఉదయం ప్రజలకు 'పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను బహుమతిగా' ఇస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. 'దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.10 పెరిగాయి. 2014లో భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డీజిల్‌పై 531 శాతం, పెట్రోల్‌పై 203 శాతం ఎక్సైజ్ సుంకం పెరిగింది. కేవలం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం ద్వారా మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో రూ.26 లక్షల కోట్లు సంపాదించింది. వంటగ్యాస్ ధరల పెంపు, జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ పెంపుదల ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. మోదీ ప్రభుత్వం రోగులను కూడా విడిచిపెట్టలేదు. ఏప్రిల్ 1 నుంచి సుమారు 800 ఔషధాల ధరలను 10.76 శాతం పెంచింది' అని సల్మాన్ ఖుర్షీద్ అన్నారు.
Abhishek Singhvi Comments on BJP: బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి చిన్న దేశాలు తమ ప్రజలకు ఉచితంగా బూస్టర్ డోస్‌లను అందిస్తున్నాయని, భారత్‌లో మాత్రం ప్రైవేట్ ఆస్పత్రుల్లో బూస్టర్ డోస్ అమ్ముతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే అధిక ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా ఇబ్బందులు పడుతున్న భారతీయులపై కేంద్రం మరో భారం వేసిందని అన్నారు. 'బూస్టర్ డోస్‌ను ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా మాత్రమే ఎందుకు ఇవ్వాలి? దానిని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పొందే అవకాశం ఎందుకు లేదు?' అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంపై పోరాడుతామని తెలిపారు. బూస్టర్ డోసు ప్రైవేటీకరణపై తీసుకున్న నిర్ణయం దారుణమని అన్నారు. వ్యాక్సిన్ తయారీ కంపెనీలు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ శనివారం ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొవిడ్ వ్యాక్సిన్ మోతాదు ధరను రూ.225కు తగ్గించాయి.
Punjab PCC New President: మరోవైపు, పంజాబ్ పీసీసీ నూతన అధ్యక్షుడిగా అమరీందర్ సింగ్ బ్రార్‌ను నియమిస్తూ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా భరత్ భూష్ ఆసూను, సీఎల్పీ నేతగా ప్రతాప్ సింగ్ బాజ్వాను నియమిస్తూ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇదీ చదవండి: 'మధ్యవర్తిత్వానికి దేశ న్యాయ ముఖచిత్రాన్ని మార్చే శక్తి'