బంగాల్ శాసన సభలో శుక్రవారం గందరగోళ పరిస్థితలు నెలకొన్నాయి. గవర్నర్కు ప్రభుత్వం ఆహ్వానం అందించకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించడంపై భాజపా ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్, వామపక్షాలు ప్రకటించాయి. అయినప్పటికీ.. అధికార తృణమూల్ కాంగ్రెస్.. సమావేశాలను కొనసాగించింది.
ఆర్థిక మంత్రి అనారోగ్యం దృష్ట్యా.. బడ్జెట్ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టారు. కోల్కతా పోలీస్ విభాగంలో నేతాజీ బెటాలియన్ను ప్రవేశపెడతున్నట్లు ఆమె ప్రకటించారు.
'అలా ఎలా జరుగుతుంది?'
గవర్నర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరగడంపై బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. అసలు అదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.
వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
బంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న దృష్ట్యా రూ.2.99 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీల కోసం 20 లక్షల ఇళ్లను నిర్మించేందుకు రూ.1500 కోట్లు, మదరసాల కోసం రూ.50 కోట్లు కేటాయించామని దీదీ చెప్పారు. కృషక్ బంధు పథకానికి రూ.6,000 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
రాబోయే ఐదేళ్లలో 46,000 కి.మీల రహదారులను అభివృద్ధి చేస్తామని మమతా తెలిపారు. 1.5 కోట్ల ఉపాధి అవకాశాల్ని కల్పిస్తామని చెప్పారు. పీఎం కిసాన్ పథకాన్ని బంగాల్లో అమలు చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందనప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామని మమతా పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'రథయాత్ర'పై భాజపా దుష్ప్రచారం: టీఎంసీ