ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా భాజపా ఎమ్మెల్యే పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణస్వీకారం చేశారు. దెహ్రాదూన్‌లోని గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌లో లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య.. ధామీ చేత ప్రమాణస్వీకారం చేయించారు. తద్వారా.. రాష్ట్రానికి సీఎంగా నియమితులైన అతిపిన్న వయస్కులుగా ధామీ(45) రికార్డుకెక్కారు.
ధామీతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. నూతన కేబినెట్లో... సత్పాల్ మహారాజ్, హరక్ సింగ్ రావత్, బంసిధార్ భగత్, యశ్పాల్ ఆర్య, బిషన్ సింగ్ చుపాల్, సుబోధ్ ఉన్నియల్, అరవింద్ పాండే, గణేశ్ జోషి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
మోదీ అభినందన
సీఎంగా బాధ్యతలు చేపట్టిన ధామీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఉత్తరాఖండ్ అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు.
అనుకోకుండా..
నాటకీయ పరిస్థితుల్లో సీఎం పదవిని దక్కించుకున్నారు ధామీ. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి మూటగట్టుకున్న త్రివేంద్ర సింగ్ రావత్‌ను సీఎంగా తొలగించిన అనంతరం లోక్‌సభ సభ్యుడైన తీరథ్ సింగ్ రావత్‌ను ముఖ్యమంత్రిగా నియమించింది భాజపా అధిష్ఠానం. ఈ ఏడాది మార్చిలో తీరథ్.. సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే.. ఆరు నెలల్లోపు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యే అవకాశం లేకపోవడం వల్ల తీరథ్ సింగ్ పదవిలో నుంచి దిగిపోయారు. ఈ పరిస్థితుల్లో సీఎం మార్పు అనివార్యమైంది.
ఇదీ చదవండి: దేవభూమిలో 21 సంవత్సరాలు.. 10 మంది సీఎంలు