madhav on Graduate MLC Elections: జనసేనతో పేరుకే పొత్తు అనే పరిస్థితి ఉండటం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నష్టం జరిగిందని.. బీజేపీ నేత మాధవ్ అన్నారు. ఎమ్మెల్సీ పోరులో జనసేన మద్దతిస్తున్నట్లు పీడీఎఫ్ ప్రచారం చేసుకున్నా, పవన్‌కల్యాణ్ సహా ఆ పార్టీ నేతలు ఖండించలేదన్నారు. ఈ విషయాన్ని జనసేన దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. రెండు పార్టీలు కలిసి సాగాలనుకుంటే... క్షేత్రస్థాయిలో కలిసి కార్యక్రమాలు చేస్తేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందన్నారు.
మిత్రపక్షంగా తాము జనసేనతో కలిసి ఉన్నా లేనట్టే ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము కోరినప్పటికీ జనసేన నుంచి ఎక్కడా ఎలాంటి ప్రకటన, మద్దతు లభించలేదని ఆయన వ్యాఖ్యానించారు. పీడీఎఫ్ అభ్యర్ధులకు జనసేన మద్దతు ఉందని జరిగిన ప్రచారాన్ని సైతం ఖండించలేదని పేర్కొన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జనసేన పొత్తు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం లేదనేది వాస్తవమని అంగీకరించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చెప్పినట్టు ఇరుపార్టీ కార్యకర్తుల కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఈ దిశగా పవన్ కల్యాణ్, మనోహర్ ఆలోచన చేయాలని కోరుతున్నామన్నారు. లేకపోతే పేరుకే ఈ రెండు పార్టీల పొత్తు అని జనం అనుకుంటారన్నారు.
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ ఓటమికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా టీడీపీకి పడిందని చెప్పారు. పవన్ కల్యాణ్ ఆశిస్తోన్న రోడ్ మ్యాప్ అంటే... రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయడమేనని మాధవ్ తెలిపారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కు మంచి అవకాశం ఉందని... మచిలీపట్నం సభకు వచ్చిన జనాన్ని అంతా చూశారని... ఇరు పార్టీలు కలిసి పోరాటాలు చేస్తే.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని... ఇద్దరూ కలిసి ముందుకు వెళితే.. రాష్ట్రంలో ఒక ప్రభంజనం సృష్టించవచ్చని తెలిపారు. జనసేన.. టీడీపీతో వెళతారా లేదా అనేది.. తమకు తెలియదని.. ప్రస్తుతానికి బీజేపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళుతున్నాయన్నారు.
'జనసేనతో కలిసున్నాం. పేరుకు మాత్రమే కలిసున్నాం. క్షేత్ర స్థాయిలో కలిసున్నట్లుగా లేదు. మెున్న జరిగిన జనసేన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన సపోర్టు పీడీఎఫ్‌కు ఉందని సోషల్ మీడియాలో వారు ప్రకటించినా.. జనసేన నేతలు స్పందించలేదు. వైసీపీపై మా పోరాటం ఆగలేదు, ఆగదు. వైసీపీపై మాకు ఉండే వైకరిలో ఉప్పటికీ ఎలాంటి మార్పేలేదు.'- పీవీఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై పదాధికారుల సమావేశంలో చర్చ జరగలేదని అన్నారు. కానీ ఇరు పార్టీల నేతలు కలిసి పని చేయాలనే అభిప్రాయాలను మాత్రం వ్యక్తం చేశారన్నారు. వైసీపీ తో బీజేపీ కలిసి వెళుతుందనే ప్రచారం ఎక్కువుగా జరిగిందని... దీన్ని ప్రజలు కూడా విశ్వసించారన్నారు. బీజేపీకి గతంలో కంటే ఓట్లు ఎక్కువ వచ్చాయన్నారు. సొంతంగా పార్టీ ఎదిగేందుకు ఏప్రిల్ 14 వరకు వివిధ రూపాలలో కార్యక్రమాలు చేపడుతామన్నారు. మే నెలలో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఛారిషీటు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
ఇవీ చదవండి: