అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీయర్, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపాయి. గౌతమ్ అదానీ వ్యాపారాల్లో అవకతవకల ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని.. పార్లమెంటులో దీనికి సంబంధించి వివరణతో పాటు ప్రతిపక్ష పార్టీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని జార్జ్ సోరోస్ సూచించారు. దీనిపై మోదీ నోరు విప్పకుంటే కనుక ప్రభుత్వం ప్రజల్లో ఉన్న పూర్తి విశ్వాసం కోల్పోతుందని.. అలాగే ప్రధాని మోదీ ప్రజాస్వామ్యవాది కాదని సోరోస్ ఆరోపించారు. గురువారం జర్మనీలోని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సామావేశంలో జార్జ్ సోరోస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీ, అదానీకి దగ్గరి సంబంధాలున్నాయన్న సోరోస్.. హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కష్టాల్లో పడిందని అన్నారు. తద్వారా మోదీ మరింత బలహీన పడే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అదానీ వ్యవహారం భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రేరేపిస్తోందని ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
"అదానీ గ్రూప్ అవకతవకలపై మౌదీ మౌనం ఆయన ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న పూర్తి విశ్వాసాన్ని గణనీయంగా బలహీనపరుస్తుంది. అలాగే దేశ ప్రజాస్వామ్యం పునరుద్ధరణపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. మోదీ ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలి."
- జార్జ్ సోరోస్, అమెరికా బిలియనీర్
సోరోస్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. జార్జ్ సోరోస్ మోదీ పేరును మాత్రమే కాక భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అధికార బీజేపీ పేర్కొంది. "భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేసేందుకు విదేశీ శక్తులు చేస్తున్న కుట్రలను తిప్పికొడతాము. ఇందుకు జార్జ్ సోరోస్‌కు వ్యతిరేకంగా దేశ పౌరులందరూ ఏకమవ్వాలి. ఈ వ్యాఖ్యలకు మద్దతిచ్చే రాజకీయ శక్తులకు ప్రజలే సరైన బుద్ధి చేప్తారు." అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు.
సోరోస్ చేసిన ఈ కీలక వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయన అన్న మాటలు భారతదేశ ప్రజాస్వామ్యం,భారత ఎన్నికల ప్రక్రియపై ఎటువంటి ప్రభావం చూపబోవని అభిప్రాయపడింది. దేశ ప్రజాస్వామ్య పునరుద్ధరణ.. రాజకీయ పార్టీలపై ఆధారపడి ఉంటోందే తప్ప జార్జ్ చేసిన వ్యాఖ్యలపై కాదని పేర్కొంది. సోరోస్ వంటి వ్యక్తులు దేశ ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేరని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తాజాగా ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: