దేశవ్యాప్తంగా సంచలనాత్మకమైన బిల్కిస్ బానో అత్యాచారం, ఆమె కుటుంబంలోని ఏడుగురు సభ్యుల హత్య కేసులో దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. కేసు తీవ్రత ఏంటన్నది పట్టించుకోకుండా.. 11 మంది దోషులకు ఉపశమనం కల్పించడాన్ని ఆక్షేపించింది. 'ఇవాళ బిల్కిస్‌కు జరిగింది. రేపు ఇంకెవరికైనా జరగొచ్చు' అని అత్యున్నత ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. మీరు అసలు మనసుపెట్టి ఆలోచించారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది.
2002లో గోధ్రా అల్లర్ల సమయంలో గర్భిణీ బిల్కిస్ బానోపై జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన కేసులో దోషులను ముందుగానే విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో దోషుల విడుదలకు కారణాలు ఏంటని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం మంగళవారం గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న వారిపై దయ చూపేముందు దోషులు చేసిన నేరతీవ్రతను పరిశీలించాలని కదా అని అడిగింది.
"రికార్డులను ఒకసారి చూడండి. ఒకరికి 1,000 రోజులు, మరొకరికి 1,200 రోజులు, ఇంకొకరికి 1,500 రోజులు చొప్పున పెరోల్ ఇచ్చారు. ఇది సాదాసీదా సెక్షన్ 302 (హత్య) కేసు కాదు. ఇది గ్యాంగ్ రేప్‌తో ముడిపడిన హత్యల కేసు. నారింజలను యాపిల్ పండ్లతో ఎలా పోల్చలేమో... ఒక్క హత్య కేసుతో సామూహిక హత్యల్ని కూడా పోల్చలేరు."
-సుప్రీంకోర్టు
పెరోల్‌కు ముందు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం సంప్రదించినా.. కేసు తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనసుపెట్టి చూడాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. "ఈరోజు ఈ మహిళ (బిల్కిస్) అయింది. రేపు మీరో, నేనో ఎవరైనా కావచ్చు. జైలులో ఉన్న దోషులను విడుదల చేయడానికి గల కారణాలు మీరు చూపించలేక పోతే అప్పుడు మేమే సొంతంగా ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. కేసుకు సంబంధించిన అసలైన డాక్యుమెంట్లను ప్రభుత్వం సమర్పించలేదు. దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుంది. ఆ దస్త్రాలను చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సిగ్గు పడుతోంది?" అని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ధర్మాసనం ప్రశ్నించింది.
'అధికార వినియోగం అలానా?'
గుజరాత్ ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగించుకున్న తీరుపై అభ్యంతరాలు ఉన్నాయని న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ పేర్కొన్నారు. ఏపూరు సుధాకర్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో శిక్షాకాలం తగ్గింపు ఉత్తర్వును 2006లో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
"శిక్ష తగ్గించడానికి ఏ కారణాలు లేకపోతే తప్ప.. దానిలో రాష్ట్ర ప్రభుత్వ అధికారం న్యాయసమీక్ష పరిధిలోనిది కాదని మాకు తెలుసు. చేసిన నేర తీవ్రతకు అనుగుణంగా దయ అనేది ఉండాలి. దానికి కొన్ని నిర్ణీత ప్రమాణాలు అనుసరించాలి. ఇదివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించాలి. ఇలాంటి తీవ్రమైన కేసుల్లో దోషులను విడుదల చేసేటప్పుడు ప్రజలపై అది ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది? వారికి ఎలాంటి సందేశాన్ని పంపిస్తాం?.. అనేది చూడాలి" అని జస్టిస్ జోసెఫ్ స్పష్టం చేశారు.