Bilkis Bano Statement: బిల్కిస్ బానో అత్యాచార ఘటనలో దోషులను విడుదల చేయడంపై బాధితురాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తనకు న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం పోయిందన్నారు.ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని భయం లేకుండా ప్రశాంతంగా జీవించే హక్కును తిరిగివ్వాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. ఇంత పెద్ద, అన్యాయమైన నిర్ణయం తీసుకునే ముందు తన భద్రత, శ్రేయస్సును ఎవరూ ఆలోచించలేదన్నారు.తన జీవితాన్ని, కుటుంబాన్ని సర్వనాశనం చేసి మూడేళ్ల కుమార్తెను తన నుంచి దూరం చేసిన దుర్మార్గులు విడుదలయ్యారని తెలిసిన వెంటనే 20 ఏళ్ల క్రితం నాటి గాయం మళ్లీ తనను వేధించిందని తెలిపారు. దోషులను విడుదల చేయడం తనతోనే కాకుండా కోర్టుల్లో న్యాయం కోసం పోరాడుతున్న ప్రతీ మహిళ స్థైర్యాన్ని దెబ్బ తీస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. దోషులను విడుదల చేసిన నేపథ్యంలో తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని ఆమె గుజరాత్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
2002 గోద్రా అల్లర్ల అనంతరం చెలరేగిన హింసలో బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో 5 నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మందికి ప్రత్యేక సీబీఐ కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది.1992 నాటి రెమిషన్ విధానం కింద వారిని విడుదల చేసినట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. దోషులందరూ విడుదల కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి
ఇదీ చూడండి: తల్లిని బతికించుకునేందుకు తోపుడు బండిపై ఆస్పత్రికి, చివరికి