Pillion riding ban in Manguluru : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మంగళూరు పోలీసులు పలు ఆంక్షలు విధించారు.తమ కమిషనరేట్ పరిధిలో ద్విచక్రవాహన వెనుక సీట్‌పై పురుషులు ప్రయాణించడంపై నిషేధం విధించారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో మంగళూరు పోలీసులు కాసేపటికే వెనక్కి తగ్గారు. దీంతో ఆంక్షలు విధించిన గంటలోనే ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమార్ వెల్లడించారు.
అంతకుముందు మతపరమైన ఉద్రిక్తతలకు కారణమైన వరుస హత్యల నేపథ్యంలో కర్ణాటకలోని మంగళూరు పోలీసులు అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. తమ కమిషనరేట్ పరిధిలో ద్విచక్రవాహన వెనుక సీట్‌పై పురుషులు ప్రయాణించడంపై నిషేధం విధించారు. గురువారం అమల్లోకి వచ్చిన ఈ ఆంక్షలు.. ఆగస్టు 8 వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు బైక్‌లపై పురుషులెవరూ వెనుక సీట్‌పై ప్రయాణించరాదని స్పష్టం చేశారు. అయితే.. 18 ఏళ్లలోపు వారికి, వృద్ధులకు మినహాయింపు ఇచ్చారు.
దీంతో పాటు మరికొన్ని ఆంక్షలు విధించారు మంగళూరు పోలీసులు. బహిరంగ ప్రదేశాల్లో నినాదాలు చేయడం, ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడడం, ఆందోళనలకు దిగడం, ఫొటోలు/పోస్టర్లు ప్రదర్శించడాన్ని నిషేధించారు. ఒకే చోట ఐదుగురుకన్నా ఎక్కువ మంది గుమికూడరాదని స్పష్టం చేశారు. ఆయుధాలు పట్టుకుని తిరగడం, టపాసులు పేల్చడం, దిష్టిబొమ్మలు దహనం చేయడంపైనా నిషేధం విధించారు. ఆగస్టు 8 వరకు ప్రైవేటు ఫంక్షన్లు, వేడుకలు, ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. కానీ.. వెంటనే వెనక్కి తగ్గడం చర్చనీయాంశమైంది.
గత రెండు వారాల్లో మంగళూరు జిల్లాలో జరిగిన మూడు హత్యలు.. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. ముఖ్యంగా భాజపా యువజన విభాగం నేత ప్రవీణ్ నెట్టారును కొందరు కిరాతకంగా చంపడం దుమారం రేపింది. హిందుత్వ సంఘాల ప్రతినిధులు భారీ స్థాయిలో నిరసనలు చేపట్టారు. కర్ణాటకలోని భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మంగళూరు పోలీసులు తాజా ఆంక్షలు విధించారు.
ఇవీ చదవండి: 'ఆ బర్త్‌డే పార్టీ మనకు వార్నింగ్ బెల్.. గెలుపు కష్టమే'.. షాతో యడ్డీ!
'ఆ బర్త్‌డే పార్టీ మనకు వార్నింగ్ బెల్.. గెలుపు కష్టమే'.. షాతో యడ్డీ!