Bihar Reservation Increase : బిహార్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచాలని భావిస్తున్నట్లు తెలిపారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్. ఓబీసీలకు ప్రస్తుతమున్న 50 శాతం రిజర్వేషన్లను 65శాతానికి పెంచాల్సిన అవసరముందని అన్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు కలిపి 17 శాతం రిజర్వేషన్లు ఉండగా.. వాటిని 22 శాతానికి పెంచాలనుకుంటున్నట్లు తెలిపారు. కులగణనకు సంబంధించిన నివేదికను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన నీతీశ్ కుమార్.. ఈ మేరకు ప్రతిపాదించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోని దీనికి సంబంధించిన చట్టాన్ని రూపొందించాలని అభావిస్తున్నట్లు వెల్లడించారు.
Bihar Caste Census 2023 Results : మరోవైపు బిహార్‌లో మూడో వంతు కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నట్లు ఈ కులగణనలో తేలింది. 34.13 శాతం కుటుంబాలకు నెలవారీ ఆదాయం రూ.6 వేలు లేదా అంతకంటే తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. బిహార్‌లో మొత్తం 2కోట్ల 97లక్షల కుటుంబాలు ఉంటే.. అందులో 94లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నట్లు నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి తెలిపారు. బిహార్‌కు చెందిన 50 లక్షల మంది ఉపాధి, విద్య కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్లు తేలింది. ఓబీసీలు, ఈబీసీలు బిహార్‌లో 60 శాతానికి పైగా ఉండగా... అగ్రవర్ణాలు 10శాతానికి పైగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో 43 శాతం మంది పేదలు కాగా.. బీసీల్లో ఈ శాతం 33గా ఉంది. అగ్రవర్ణాల్లో 25శాతానికిపైగా పేదరికంలోనే ఉన్నట్లు నివేదిక ద్వారా స్పష్టమైంది.
"బిహార్ పేద రాష్ట్రం.. మేము అభివృద్ధి చెందాలంటే మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇప్పటివరకు కులగణను చేపట్టలేదు. దేశవ్యాప్తంగా కూడా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం."
--నీతీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి
ఇదిలాఉంటే, బిహార్‌లో కులగణన చేపట్టాలని నిర్ణయించిన నీతీశ్ కుమార్ ప్రభుత్వం.. ఇటీవలే దీన్ని పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను అక్టోబర్ 2న విడుదల చేయగా.. ఆర్థిక, విద్యకు సంబంధించి అంశాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
Bihar Caste Survey Results : బిహార్ జనాభాలో ఓబీసీలు, ఈబీసీలు 63శాతం.. క్యాస్ట్ సర్వే రిలీజ్