హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్న వేళ ఆ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు ముఖ్యమంత్రి జైరామ్ ఠాకుర్. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నెలకు 125 యూనిట్లు విద్యుత్ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. మహిళలకు బస్ టికెట్లపై 50శాతం రాయితీ ఇస్తామని వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చంబాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ ప్రకటనలు చేశారు జైరామ్.
హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే ప్రతి కుటుంబానికి నెలకు 60 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తోంది అక్కడి ప్రభుత్వం. ఈ పథకాన్ని నెలకు 125 యూనిట్లకు విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి శుక్రవారం ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 11.5 లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతుందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి బిల్లులనూ మాఫీ చేయనున్నట్లు చెప్పారు సీఎం. ప్రస్తుతం జలశక్తి శాఖకు నీటి బిల్లుల రూపంలో రూ.30కోట్లు ఆదాయం వస్తోంది.
ప్రజాసంక్షేమానికి సంబంధించి మరికొన్ని కీలక ప్రకటనలు చేశారు జైరామ్ ఠాకుర్. ఉట్టల-హోలీ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. చంబాలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే.. ప్రభుత్వ ఉద్యోగుల్లో సంతోషం నింపేలా ముఖ్యమంత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు.
2017 శాసనసభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించగా జైరామ్ ఠాకుర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది నవంబర్‌లో మళ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన కమలదళం.. హిమాచల్ ప్రదేశ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. 2021లో నాలుగు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో అన్నింటా గెలిచిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ వైపు నిలుస్తారని ఆశిస్తోంది. పంజాబ్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో హిమాచల్ ప్రదేశ్ బరిలోకి దిగుతున్న ఆమ్ఆద్మీ పార్టీ.. ఇప్పటివరకు భాజపా-కాంగ్రెస్ మధ్య ఉన్న పోరును త్రిముఖంగా మార్చాలని ప్రయత్నిస్తోంది.