Bhupendra Patel Oath : గుజరాత్ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ.. ఆ రాష్ట్రంలో వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌తో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించారు. దీంతో గుజరాత్ సీఎంగా వరుసగా రెండోసారి భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని కొత్త సచివాలయానికి సమీపంలో ఉన్న హెలిప్యాడ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్‌తో పాటు పలువురు కేబినేట్ మంత్రులు, పలువురు స్వతంత్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. కానుభాయ్ దేశాయ్, రుషికేష్ పటేల్, రాఘవ్‌జీ పటేల్, బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్, కువర్జీ బావాలియా, ములుభాయ్ బేరా, కుబేర్ దిండోర్, భానుబెన్ బాబారియా కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. హర్ష్ సాంఘవి, జగ్‌దీశ్ విశ్వకర్మ, పర్‌శోత్తమ్ సోలంకి, బాచుభాయ్ ఖాబద్, ముఖేశ్ పటేల్, ప్రఫుల్ పాన్షేరియా, భిక్షుసిన్హ్ పార్మర్, కున్‌వర్జి హల్‌పతీ స్వతంత్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణస్వీకారం చేసిన వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
182 స్థానాలున్న గుజరాత్ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా 156 స్థానాలు గెలుచుకుంది. 60 ఏళ్ల భూపేంద్ర పటేల్ శుక్రవారం తన మంత్రివర్గంతో సహా రాజీనామా చేయగా.. శనివారం ఆయనను భాజపా శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ఘట్లోడియా నియోజకవర్గం నుంచి రెండోసారి గెలుపొందిన సీఎం భూపేంద్ర పటేల్.. ఈసారి 1.92 లక్షల ఓట్ల భారీ మెజార్టీ సాధించారు. 2017ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. అధిష్ఠానం ఆదేశాల మేరకు గతేడాది సెప్టెంబరులో విజయ్ రూపాని స్థానంలో భూపేద్రపటేల్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
మోదీ రికార్డునే బద్దలుకొట్టి..
2002లో నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో భాజపా 127 స్థానాల భారీ మెజార్టీతో విజయం సాధించింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భూపేంద్ర పటేల్ ఆ రికార్డును బద్దలుకొట్టారు. ఏకంగా 156 మంది ఎమ్మెల్యేల బలగంతో సీఎం బాధ్యతలు అందుకోబోతున్నారు. ఇక, మోదీకి, భూపేంద్ర పటేల్‌కు ఓ సారూప్యత కూడా ఉంది. పటేల్ ఎలాంటి మంత్రి పదవులు నిర్వహించిన అనుభవం లేకుండానే గతేడాది తొలిసారి సీఎం బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ప్రధాని మోదీ కూడా ఎలాంటి మంత్రి పదవి చేపట్టకుండానే గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు.
ఇతర విశేషాలు..
- 60 ఏళ్ల భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్‌లో జన్మించారు. అక్కడి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశారు.
- అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా, పురపాలక సంఘం స్థాయీ సంఘం ఛైర్మన్‌గా, మున్సిపల్ పాఠశాలల కమిటీ ఉపాధ్యక్షునిగా పనిచేశారు.
- ఎల్లప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఆయన మృదుభాషి. అందరూ ‘దాదా’ అని ఆప్యాయంగా పిలుస్తారు.
- పటేల్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. రాజకీయాల్లోకి రాకముందు నిర్మాణ రంగ వ్యాపారం నిర్వహించేవారు. ఆర్‌ఎస్‌ఎస్‌తోనూ అనుబంధం ఉంది. భాజపాలో ఈయనను ట్రబుల్ షూటర్, వ్యూహకర్తగా పిలుస్తారు.