దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తికరమైన విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో అమూల్యమైన సేవలందించిన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి ఈ ఏడాదికి గానూ భారతరత్న ప్రకటించాలని సూచించారు. కొవిడ్ వేళ ప్రాణాలు కోల్పోయిన వైద్యులకు ఇదే అసలైన నివాళి అవుతుందని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
"భారతీయ వైద్యులు ఈ ఏడాది భారతరత్న స్వీకరించాలి. భారతీయ వైద్యులు అంటే ఇందులో దేశంలోని వైద్యులు, నర్సులు, పారామెడిక్ సిబ్బంది ఉంటారు. అమరులైన వైద్యులకు ఇచ్చే అసలైన గౌరవం ఇదే. తమ జీవితాలు, తమ కుటుంబ సభ్యుల జీవితాలను లెక్కచేయకుండా సేవ అందిస్తున్నవారికి అందించే గొప్ప గౌరవం ఇది. మొత్తం దేశం దీనికి ఆనందిస్తుంది."
-కేజ్రీవాల్ ట్వీట్
ఓ వర్గానికి అవార్డు ఇచ్చేందుకు అనుమతి లేకుంటే.. నిబంధనలను సవరించాలని కేజ్రీ సూచించారు. వైద్య వర్గం మొత్తానికి భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
వందల సంఖ్యలో మృతి
రెండో దశ వ్యాప్తి సమయంలో సుమారు 730 మంది వైద్యులు కరోనాకు బలయ్యారు. బిహార్లో 115, దిల్లీలో 109, యూపీలో 79 మంది మరణించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం 748 మంది డాక్టర్లు తొలి దశ వ్యాప్తి సమయంలో ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: