ఝార్ఖండ్ నక్సలిజం వైపు అడుగులేస్తుందా లేదా అభివృద్ధిని ఎంచుకుంటుందా అన్నది ఓటర్లే నిర్ణయిస్తారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు.
ఝార్ఖండ్‌లో కాంగ్రెస్ గత 55 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి పనులేంటో చెప్పాలని... ఐదేళ్లుగా తాము చేసిన అభివృద్ధిని చూపిస్తామన్నారు. అయోధ్యలో ఆకాశాన్నంటే రామ మందిరాన్ని నిర్మిస్తామని అమిత్‌షా అన్నారు. 2024 నాటికి దేశమంతా ఎన్ఆర్సీ అమలు చేసి తీరతామని ఉద్ఘాటించారు భాజపా జాతీయాధ్యక్షుడు.
'అయోధ్య రామజన్మ ప్రాంతంలో మందిరం కట్టాలా వద్దా మీరే చెప్పండి? రామ జన్మభూమి కేసు త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో చెప్పారు. ఈ కేసులో త్వరగా తీర్పు రావాలని మేము కోరాం. దేశమంతా ఇదే కోరుకుంటున్నారని తెలిపాం. దాని ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడు ఆకాశాన్నంటే రామ మందిరం అయోధ్యలో నిర్మితం కానుంది. 2024 ఎన్నికల ప్రచారానికి వచ్చే ముందే దేశమంతా ఎన్‌ఆర్‌సీని అమలు చేసి, అక్రమ వలసదారులను తరిమికొడతాం.''
- అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి, భాజపా జాతీయాధ్యక్షుడు