కేరళలోని కోజికోడ్‌లో షిగెల్లా వ్యాధి విజృంభిస్తోంది. బుధవారం మరొకరు ఈ వ్యాధి బారినపడినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కోజికోడ్ జిల్లా కల్లాంపర కశ్యప్పడిలోని ఏడాదిన్నర శిశువుకు ఈ వ్యాధి సోకినట్లు పేర్కొంది. ప్రస్తుతం.. చిన్నారి ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేశారు ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ. బ్యాక్టీరియా వల్ల కలిగే ఈ వ్యాధి గురించి భయాందోళన అవసరం లేదని, వ్యాప్తి మూలాలను గుర్తించేందుకు వైద్య నిఫుణులు ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పారు.
కోజికోడ్‌లోని కొట్టప్పరంబు, ముందిక్కల్తాజం ప్రాంతంలో కొద్దిరోజుల కింద దాదాపు 20 మందిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఒకరు చనిపోయారు.
ఈ ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యలు, అత్యవసర అవగాహన కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తి అదుపులో ఉందని ఆరోగ్య శాఖ పేర్కొన్న వెంటనే.. అదే జిల్లాలోని మరో ప్రాంతంలో కేసు బయటపడటం గమనార్హం.
విరేచనాల కారణంగా.. ఆస్పత్రిలో చేరిన శిశువును పరీక్షించగా షిగెల్లా సోకినట్లు నిర్ధరణ అయింది. అయితే.. ఇదివరకు షిగెల్లా లక్షణాలు కనిపించిన కొట్టప్పరంబుతో.. ఈ కొత్త కేసుకు ఎలాంటి సంబంధం కనిపించలేదని ప్రాథమికంగా తేల్చారు. ఈ అంటువ్యాధి పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.
ఇదీ చూడండి: కేరళలో కొత్త వ్యాధి అదుపులోకి వచ్చినట్టేనా?
షిగెల్లా వ్యాధి లక్షణాలు:
- జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట మొదలైనవి షిగెల్లా వ్యాధి ప్రథమ లక్షణాలు.
- కలుషిత నీరు, పాడైన ఆహారం సేవించడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది.
- ఈ వ్యాధి సంక్రమణ ఐదేళ్లలోపు పిల్లలకు ప్రమాదకారిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
- షిగెల్లా వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది. వ్యాధిగ్రస్తుడితో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కాంటాక్ట్‌లోకి వస్తే వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి .
- 2 నుంచి 7 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం పట్టొచ్చు.
వ్యాధి సోకకుండా తీసుకొవాల్సిన జాగ్రత్తలు:
- కాచిచల్లార్చిన నీరు మాత్రమే తాగాలి.
- తరచుగా.. సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
- మంచి ఆహారం సేవించాలి.
- బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయకూడదు.
- ఉపయోగించిన డైపర్లను సరైన పద్ధతిలో పడేయాలి.
- వ్యాధి లక్షణాలు ఉన్నవారు వంటలు చేయకూడదు.
- నీటిని, ఆహార పాత్రలను మూతలతో కప్పి ఉంచాలి.
- విరేచనాలు ఉన్న పిల్లలను ఇతరులతో కలవనివ్వకూడదు.
- వ్యాధిగ్రస్తులతో కలవకపోవడం శ్రేయస్కరం.
- వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఓఆర్ఎస్, ఉప్పు ద్రావణం, కొబ్బరి నీరు వంటివి తాగి రీహైడ్రేట్ చేసుకోవాలి.