కర్ణాటక నూతన ముఖ్యమంత్రి యడ్యూరప్ప పేరు మార్చుకున్నారు. జ్యోతిష్కుడి సూచన మేరకు ప్రస్తుత పేరుకు స్వల్ప మార్పులు చేసి.. గతంలో ఉన్న యడియూరప్ప పేరునే మళ్లీ పెట్టుకున్నారు. ఇది వరకు ఆయన మూడుసార్లు సీఎం పదవి చేపట్టినప్పటికీ పూర్తికాలం పదవీ బాధ్యతలు ఏనాడూ చేపట్టలేదు. ఈ నేపథ్యంలో మరోమారు పేరు మార్చుకున్నారు యడ్డీ.
ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని గవర్నర్కు అందజేసిన లేఖలో యడియూరప్ప పేరే ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ అధికారిక ఆహ్వాన పత్రికలోనూ ఇదే పేరును అచ్చు వేయించారు కన్నడ ముఖ్యమంత్రి.
మునుపటి పేరుకే మొగ్గు
ఇప్పటివరకు ఆయన పేరు యడ్యూరప్ప అని ఉండగా.. తాజాగా యడియూరప్పగా మార్చుకున్నారు. 2007లో తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పుడు ఆయన పేరులో మార్పులు చేసుకున్నారు. యడియూరప్పను యడ్యూరప్పగా మార్చుకున్నారు. రాజకీయంగా ఆ సమయంలో గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నందున జ్యోతిష్కుడి సలహా మేరకు పేరులో అక్షరాలను మార్పు చేసుకున్నారు. తాజాగా మరోసారి పేరు మార్చుకున్నారు యడ్డీ.