గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఈ బ్యాంకులో డబ్బు, బంగారం, భూపత్రాలు ఏవీ ఉండవు. కేవలం మానవ అస్థికలు మాత్రమే ఉంటాయి. అవును మరి, ఈ బ్యాంకు కేవలం అస్థికలు భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిందే. తమ ఆత్మీయులు మరణించాక ఆ అస్థికలు గంగలో కలిపేవరకు వాటిని ఇక్కడ జాగ్రత్తగా దాచుకుంటారు ఛార వంశస్థులు.
ఎన్నేళ్లైనా అక్కడే...
ఛారనగర్లో నివసించే ఛార వర్గంవారు తరతరాలుగా అస్థికలు భద్రపరిచే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఛార వర్గంలో ఓ వ్యక్తి మరణిస్తే... అంతిమ సంస్కారాలు నిర్వహించిన అనంతరం ఓ డబ్బాలో బూడిద, ఎముకలు వేస్తారు. డబ్బాపై మరణించిన వ్యక్తి పేరు రాసి జాగ్రత్తగా దాస్తారు. ఆ తరువాత మరణించిన వ్యక్తి బంధువులు వచ్చి వాటిని తీసుకెళ్తారు.
ఛార వంశీయులు ఎన్నేళ్ల తరువాత వచ్చినా.. వారి ఆత్మీయుల అస్థికలు ఈ బ్యాంకులో పదిలంగా ఉంటాయని చెబుతున్నారు బ్యాంకు నిర్వహకులు.
'ఇది ఛార సమాజం వారి అస్థికల బ్యాంకు. చనిపోయినవారికి అంతిమ సంస్కారాలు నిర్వహించి, వారి అస్థికలను మేము ఇలా భద్రపరుస్తాం. అనేక ఏళ్లుగా ఇక్కడ ఇలా అస్థికల గదిని తయారు చేశాం. కొందరు వెంటనే తీసుకెళ్తారు. కొందరు ఆలస్యంగా వస్తారు. కానీ, కచ్చితంగా తీసుకెళ్తారు. ఛార సమాజ నియమాల అనుసారం తీసుకెళ్లాలి కూడా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డబ్బాలు కనీసం 15 నుంచి, 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాయి.'
-అనిల్ ఛార, నిర్వహకుడు.
అందుకే ఇలా..
హిందూ సంప్రదాయాల ప్రకారం మరణించినవారి అస్థికలను నీటిలో కలిపితేనే ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్మకం. కానీ, ఉరుకుల పరుగుల జీవితాల్లో ఆ పని చేయడం అంత త్వరగా అయ్యే పని కాదు. అందుకే, వారికి వీలు దొరికినప్పుడే అస్థికలను గంగలో కలిపేలా ఛార వంశస్థులు ఇలా ఓ బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు.
ఇదీ చదవండి:అడవిని చదివిన 'తులసి'బామ్మకు పద్మశ్రీ