ఐఏఎస్ అధికారులు ఎవరికి వారు కాకుండా.. కలిసి కట్టుగా పని చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. యువ ఐఏఎస్ అధికారులకు గుజరాత్‌లోని కేవడియాలో 'ఆరంభ్' పేరుతో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ.
అధికార పీఠం మీద ఉన్నామనే ఆలోచనతో పని చేయరాదని.. దానివల్ల వ్యవస్థకు ఎలాంటి మేలు జరగదని మోదీ అన్నారు. 2024-25 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఐఏఎస్‌లు పని చేయాలని సూచించారు. ఆరంభ్ శిక్షణ కార్యక్రమం దేశం, భవిష్యత్తు కేంద్రంగా రూపొందించిందని తెలిపారు.
"దేశంలోని పేదలు, ప్రజలకు మనం అంతా రుణపడి ఉన్నాం. ఆ పేదల రుణం తీర్చుకోవడానికి మన వద్ద ఒకటే పద్ధతి ఉంది. దేశ ప్రజల జీవితాన్ని మనం సులభతరం చేయాలి. వారి హక్కులు వారికి దక్కేలా నిజాయితీగా పని చేయాలి. బాగా కష్టపడాలి. ఇప్పుడు ఉన్న నూతన భారతం చాలా ఆకాంక్షలను కల్గి ఉంది. అభివృద్ధి కోసం వారి తపన గతంలో కంటే ఎక్కువైంది. విషయాల పట్ల దేశ ప్రజలు గతంలో కంటే ఎక్కువ అవగాహన కల్గి ఉండడాన్ని మనం చూస్తున్నాం. వారు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కువగా భాగస్వాములు అవుతున్నారు. ఈ పరిస్ధితుల్లో మనకు కూడా బాధ్యత ఉంటుంది. ఇందుకోసం మనం చురుగ్గా పని చేసి తీరాల్సిందే."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఐఏఎస్‌లు ఎలాంటి పదవిని అయినా శిక్షగా కాకుండా, అవకాశంగా భావించి పని చేయాలని సూచించారు ప్రధాని. మనం ఎవరమైనా, ఎక్కడ ఉన్నా దేశం కోసం కలిసి పని చేయాలని అన్నారు. దేశ ప్రజల రుణం తీర్చుకునేందుకు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు.
ప్రసంగం అనంతరం ఐఏఎస్ శిక్షణ పొందుతున్న వారితో కలిసి గ్రూప్ ఫొటోలో పాలుగొన్నారు మోదీ.
ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్ పునర్విభజనపై చైనా అక్కసు.. తిప్పికొట్టిన భారత్