'నారీ శక్తి' అవార్డు గ్రహీతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం భేటీ కానున్నారు. అలాగే.. రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని ట్విట్టర్ ఖాతాను వివిధ రంగాల్లో విజయవంతమైన మహిళలు నిర్వహిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది.
రాష్ట్రపతి భవన్లో..
ఆదివారం ఉదయం రాష్ట్రపతి భవన్లో నారీశక్తి అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేస్తారు. ఆ కార్యక్రమం అనంతరం అవార్డు పొందిన మహిళలతో మోదీ మాటామంతి ఉంటుంది. మహిళా సాధికారత, వివిధ రంగాల్లో వారు సాధించిన విజయాలపై చర్చించనున్నారు మోదీ.
నారీశక్తి అవార్డులను ప్రతి ఏటా వ్యక్తిగతంగా, బృందాలకు, మహిళా సాధికారత కోసం కృషి చేసే సంస్థలకు అందిస్తున్నారు.
నిర్వహణ మహిళలకే..
తన సామాజిక మాధ్యమాల ఖాతాలను నిర్వహించే పనిని మహిళలకు అప్పగిస్తానని గత మంగళవారం ప్రకటించారు ప్రధాని.
"ఈ మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా.. స్ఫూర్తివంతమైన మహిళలకు నా సామాజిక మాధ్యమాల ఖాతాల నిర్వహణ బాధ్యతలు ఇస్తాను. అది లక్షలాది మందిలో ప్రేరణను కలిగించడానికి వారికి మరింత సహాయపడుతుంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ప్రపంచ నాయకుల్లో ఒకరు..
ప్రధాని మోదీకి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఖాతాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న నాయకుల్లో మోదీ ఒకరు. ఆయనను ట్విట్టర్లో 53.5 మిలియన్లు, ఫేస్బుక్లో 44 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 35.2 మిలియన్ మంది అనుసరిస్తున్నారు. దీంతో పాటు ప్రధాని కార్యాలయం నిర్వహించే ట్విట్టర్‌ను 32 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.