సాధారణంగా హిందూ ఆలయాల్లో పురుషులే పూజారులుగా వ్యవహరిస్తుంటారు. స్త్రీలను గర్భగుడి దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. కొన్ని దేవాలయాల్లో మహిళలకు ప్రవేశమే నిషిద్ధం. అయితే కర్ణాటక కోరామంగళ వెంకటపురలోని మారమ్మతల్లి గుడిలో మాత్రం అందుకు భిన్నం.. అక్కడ ఆడవారే అర్చకులు.
కారణం ఇదీ..
మారమ్మతల్లికి మహిళలు పూజలు చేసే ఆచారం 50 ఏళ్లుగా కొనసాగుతోంది. సుందరమ్మ అనే మహిళ కొన్నేళ్లుగా ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నారు. సుందరమ్మ వంశంలో కుమారులు లేకపోవడం వల్ల కూతుళ్లు ఆ బాధ్యతలు తీసుకుంటూ వస్తున్నారు. సుందరమ్మ తన తండ్రి నుంచి పూజారి బాధ్యతలు తీసుకోగా.. ఇప్పుడు ఆమె ఐదుగురు కుమార్తెలు అర్చకులుగా మారి మారమ్మతల్లికి సేవలు చేస్తున్నారు. స్త్రీలు పూజలు చేయడం వల్ల మారమ్మతల్లి ప్రసన్నమై కోరిన కోర్కెలు తీర్చుతోందని ఇక్కడి ప్రజల నమ్మకం.
"మేము ఏళ్లుగా మారమ్మతల్లికి పూజలు చేస్తున్నాం. ఇక్కడ కేవలం మహిళలే పూజలు నిర్వహిస్తారు. మా వంశంలో మగబిడ్డలు లేనందున ఈ బాధ్యతను మేము తీసుకున్నాం. మా తాత మా తల్లికి అప్పగించిన బాధ్యతలను నేను నా కుమార్తెలకు అప్పగిస్తున్నాను."
-సుందరమ్మ
ఈ ఆలయంలో నిత్యం అభిషేకాలు, రోజుకు రెండు సార్లు పూజ, ప్రతి శుక్రవారం నిమ్మకాయ హారతి అందుకుంటారు అమ్మవారు. దసరా సమయంలో నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. అతివలే పూజారలుగా ఉండే ఈ ఆలయానికి మహిళా భక్తులే అధికంగా వస్తుంటారు కాబట్టి.. ఇది లేడీస్ స్పెషల్ గుడిగా మారిపోయిందిప్పుడు.