'బందోబస్తు విధుల నిర్వహణ నిమిత్తం వెంటనే వచ్చేయండి! అర్జెంట్ సుమా!' అంటూ పై అధికారి నుంచి అందిన వర్తమానం చూసుకున్న మహిళా కానిస్టేబుళ్లంతా హుటాహుటిన ఓ పోలీసు స్టేషన్‌కు పరుగుపెట్టారు. అక్కడికెళ్లాక ఆ అధికారి చెప్పిన వార్త విని ఒక్కక్షణం అవాక్కయ్యారు. ఆ తర్వాత ఆనందంతో ఎగిరి గంతేశారు. మహారాష్ట్ర ఠానే జిల్లా భయాందర్ పోలీసు స్టేషన్‌లో గురువారం జరిగిన ఆహ్లాదకరమైన సంఘటన ఇది.
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ శివాజీ రాఠోడ్ ఆదేశాల మేరకు స్టేషన్‌కు వెళ్లిన దాదాపు వందకు పైగా మహిళా కానిస్టేబుళ్లకు ఆయన డ్యూటీ ఏంటో చెప్పడానికి బదులు 'ముందు భోంచేయండి! ఆ తర్వాత సినిమాకెళుదురుగానీ' అని చెప్పారు. కమ్మటి భోజనం చేశాక... సగౌరవంగా వాహనాల్లో మహిళా కానిస్టేబుళ్లందరినీ ‘మర్దానీ-2’సినిమాకు పంపారు. మహిళా పోలీసు సిబ్బంది ఓ వైపు ఇల్లు చక్కబెట్టుకుంటూనే విధినిర్వహణలో నిబద్ధతతో పనిచేసే తీరును దృష్టిలో పెట్టుకుని ఆటవిడుపుగా వారికి ఈ అవకాశాన్ని కల్పించినట్లు అదనపు ఎస్పీ సంజయ్‌పాటిల్ తెలిపారు.
అభంశుభం తెలియని బాలికల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల ముఠాల ఆటకట్టించిన మహిళా పోలీసు అధికారి సాహసమే ఇతివృత్తంగా ‘మర్దానీ-2’ చలనచిత్రాన్ని రూపొందించారు.
ఇదీ చూడండి: భాజపా విధానాల వల్లే హింసవైపునకు అసోం: రాహుల్