కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి తీరని నష్టాన్ని చేకూర్చితే.. బంగాల్‌కు చెందిన ఓ మహిళకు మాత్రం మేలు చేసింది. ఇంటి నుంచి వెళ్లిపోయిన తన భర్తను 20 ఏళ్ల తర్వాత కలిపింది. భర్త తిరిగి వచ్చిన తరుణంలో ఆమె సంతోషానికి అవధులు లేవు.
ఇదీ జరిగింది..
పశ్చిమ బంగ అసన్సోల్ జిల్లా బర్న్‌పుర్ గ్రామానికి చెందిన సురేశ్ ప్రసాద్ అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం భార్యపై కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దిల్లీకి చేరుకుని.. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించటం వల్ల దిల్లీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించటం ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రసాద్ దిల్లీ నివాసి కాదని తేలింది. వలస కూలీలను స్వరాష్ట్రాలకు తరలించే క్రమంలో ప్రసాద్‌ను అసన్సోల్కు పంపారు అధికారులు. 20 ఏళ్ల తర్వాత భర్త తిరిగి రావటం వల్ల అతని భార్య ఊర్మిళ ప్రసాద్ సంతోషం వ్యక్తం చేసింది.
14 రోజుల క్వారంటైన్లో భాగంగా ప్రసాద్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు అధికారులు.