అక్రమ వలదారులను ఏరివేసేందుకు ఇటీవల అసోంలో చేప్టటిన జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ)పై పలు విమర్శలు తలెత్తిన వేళ.. హరియాణాలోనూ ఎన్ఆర్సీ చేపడతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.
అక్టోబర్లో హరియాణా శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలువురు ప్రముఖుల మద్దతు పొందేందుకు 'మహా సంపర్క్ అభియాన్' కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం నౌకాదళ మాజీ ప్రధానాధికారి సునీల్ లాంబా, మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎస్ భల్లాతో ఖట్టర్ భేటీ అయ్యారు.
" ఈరోజు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎస్ భల్లా, నౌకాదళ మాజీ ప్రధానాధికారి సునీల్ లాంబాను కలిశాను. ఈ భేటీలో దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇతర సమస్యలపై చర్చించటం జరిగింది. హరియాణాలో జాతీయ పౌర జాబితాను అమలు చేయబోతున్నాం. అందుకోసం సలహాలు, మద్దతు ఇవ్వాలని భల్లాజీని కోరాను."
- మనోహర్ లాల్ ఖట్టర్, హరియాణా ముఖ్యమంత్రి.
అసోంలో నిర్వహించిన ఎన్ఆర్సీ తుది జాబితాను గత ఆగస్టు 31న ప్రకటించారు. ఇందులో 19 లక్షల మంది పౌరులకు చోటు దక్కలేదు. ఈ ప్రక్రియపై భాజపా సహా పలు పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
ఇదీ చూడండి: 60 వసంతాలు పూర్తి చేసుకున్న 'దూరదర్శన్'