శబరిమల విషయంలో వాదనలు ముగిసిన తరువాతే పౌర చట్టాన్ని (సీఏఏ) సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సీఏఏ పిటిషన్లపై ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదని అందుకే ఈ అంశంపై అత్యవసరంగా విచారణ జరపాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం 2 రోజుల్లో దీనిపై సమాధానం ఇస్తుందని న్యాయస్థానానికి వివరించారు అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్.
ఇరువురి వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం... సీఏఏ అంశాన్ని శబరిమల వాదనలు ముగిసిన తరువాతే పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
విస్తృత ధర్మాసనం పరిధిలో
శబరిమల ఆలయం, మసీదుల్లోకి మహిళల ప్రవేశం, దావూదీ ముస్లిం సమాజంలో జననేంద్రియాల అంశం, పార్శీ యువతులు.. పార్శీయేతర పురుషులను వివాహం చేసుకుంటే పవిత్ర అగ్నిదేవాలయంలోకి అనుమతి నిరాకరణ సహా ఇతర అంశాలపై 9 మంది సభ్యుల సుప్రీం ధర్మాసనం పునఃపరిశీలిస్తోంది.
వెకేషన్ బెంచ్
7 రోజుల హోలీ సెలవుల సమయంలో అత్యవసర కేసులు విచారించడానికి వెకేషన్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ ధర్మాసనం హోలీ పండుగ రోజు తప్ప మిగతా వారమంతా పనిచేస్తుందని ధర్మాసనం పేర్కొంది. సాధారణంగా సుప్రీంకోర్టుకు రెండు నెలల పాటు వేసవి సెలవులు ఉంటాయి.
ఇదీ చూడండి: భారత్లో 29 కరోనా కేసులు: రాజ్యసభలో కేంద్ర మంత్రి