ఊహించని పరిణామాల మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాజపాను స్పీకర్ ఎన్నిక సమయంలోనే ఓడిస్తామని పేర్కొంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ). పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో ముంబయి వైబీ చవాన్ కేంద్రంలో పార్టీ శాసనసభ్యులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మినహా.. మిగతావారంతా తమతోనే ఉన్నారని తెలిపారు పార్టీ ప్రతినిధి, సీనియర్ నేత నవాబ్ మాలిక్.
"ప్రభుత్వానికి నవంబర్ 30 వరకు గడువు ఇచ్చారు. వారిని మేము స్పీకర్ ఎన్నికలోనే ఓడిస్తాం. అనంతరం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కచ్చితంగా చెప్పగలను. పార్టీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేలలో ఐదుగురు మాత్రమే మాతో లేరు. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ముంబయికి వస్తున్నారు. మిగతా 43 మంది శాసనసభ్యులు ముంబయిలోని ఓ హోటల్లో గడపనున్నారు."
- నవాబ్ మాలిక్, ఎన్సీపీ అధికార ప్రతినిధి
క్యాంపు రాజకీయాలు..
నవంబర్ 30 వరకు బలనిరూపణకు సమయం ఉన్నందున పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చర్యలు చేపట్టింది ఎన్సీపీ. సమావేశానికి హాజరైన 43 మంది ఎమ్మెల్యేలు అందరినీ ముంబయిలోని ఓ ప్రైవేటు హోటల్‌కు తరలించింది. బలనిరూపణ పూర్తయ్యే వరకు వారంతా అక్కడే ఉంటారని సమాచారం.
పార్టీ భేటీలోనివే..
ప్రమాణ స్వీకారం చేసే ముందు గవర్నర్‌కు అజిత్ పవార్ సమర్పించిన లేఖలో సంతకం చేసిన ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు పలకలేదన్నారు మాలిక్. అంతకు ముందు పార్టీ సమావేశానికి హాజరైన సమయంలో ఎమ్మెల్యేలు సంతకం చేసిన లేఖను సమర్పించారని తెలిపారు. రాజ్‌భవన్‌లో అజిత్ పవార్‌తో ఉన్న ఎమ్మెల్యేలు.. తర్వాత శరద్ పవార్‌కే జై కొట్టారని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: మహా చదరంగం: మోదీ-షా X శరద్ పవార్