కశ్మీర్ ప్రజల దుస్థితికి కాంగ్రెస్సే కారణమని నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రతీ కశ్మీర్వాసిని ఆప్యాయంగా ఆలింగనం చేసి ఆ ప్రాంతాన్ని మరోసారి స్వర్గంగా తీర్చిదిద్దాలని మహారాష్ట్రలోని నాసిక్ వేదికగా ప్రధాని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో భాజపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ.. కశ్మీర్లో హింస సృష్టించడానికి సరిహద్దులో కొందరు తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు.
"కశ్మీర్ మనదని నిన్నటి వరకు చెప్పేవాళ్లం. సరికొత్త కశ్మీర్‌ను సృష్టించి.. దాన్ని మరోసారి స్వర్గంగా తీర్చిదిద్దాలని ఇప్పటి నుంచి దేశం అంటుంది. ప్రతి కశ్మీర్వాసిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవాలి. ఈ నిర్ణయంపై హింస, దుష్ప్రచారం చేయడానికి భారీ సంఖ్యలో కుట్ర జరుగుతోంది. కానీ జమ్ముకశ్మీర్ యువత, అక్కడి అమ్మలు, సోదరీమణులు ఈ హింస నుంచి బయటపడాలని నిర్ణయించేసుకున్నారు. అభివృద్ధివైపు నడవాలని కోరుకుంటున్నారు. ఉద్యోగాలు కావాలనుకుంటున్నారు. మీ ఈ సేవకుడు(మోదీ), మీ ప్రభుత్వం.. మీ అందరిని ఒక్కటి చేసి కశ్మీర్ ప్రజలను, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పథంవైపు నడింపించడానికి ప్రణాళికలు రచిస్తున్నాం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
130 కోట్ల భారతీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకునే కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని.. కేంద్రం రద్దు చేసిందని మోదీ తెలిపారు.
ఈ నేపథ్యంలో విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధాని. దేశ హితం కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించకుండా.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌పై ప్రసంశల వర్షం కురిపించారు మోదీ. పూర్తిస్థాయి మెజారిటీ లేకుండానే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు పరిగెత్తించారని కొనియాడారు. తనలాగే ఫడణవీస్ కూడా భక్తి, శ్రద్ధలతో విధులు నిర్వర్తిస్తున్నారని మోదీ అభిప్రాయపడ్డారు.
ప్రధానిగా రెండో దఫా 100రోజుల పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు మోదీ. హామీలు నెరవేరుస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో తయారు చేసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను 100 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు.
50 కోట్ల మూగ జీవాలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన జంతువుల వ్యాధి నియంత్రణ కార్యక్రమంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు మోదీ. వాటికి ఓటు హక్కు లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇదీ చూడండి:- ‘దేశానికి సేవ చేసిన రియల్ హీరో'