కేంద్రంపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో తమకు మద్దతు లభిస్తుందని 99శాతం మంది ప్రజలు ఆశిస్తే.. కేవలం ఒక శాతం సంపన్నులకు మేలు చేసేలా బడ్జెట్ను రూపొందించారని దుయ్యబట్టారు. దేశంలోని పేదలు, శ్రామికులు, రైతులు, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల సంపదను తీసుకెళ్లి 5 నుంచి 10 మంది ధనికుల జేబుల్లో కేంద్రం పెడుతోందని ధ్వజమెత్తారు.
పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చే ప్రవేటీకరణ గురించే కేంద్రం మాట్లాడుతోందని రాహుల్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకోవాలంటే ప్రజలకు నేరుగా ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగం ద్వారానే ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకుంటుందని, సరఫరా ద్వారా కాదని తెలిపారు.
దిల్లీ సరిహద్దులో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దాదాపు రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని రాహుల్ ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. దిల్లీని 'గడీ'లా ఎందుకు మార్చారని నిలదీశారు. సాగు చట్టాలను రెండేళ్లపాటు నిలిపివేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ ప్రకటించడం వెనుక అర్థమేంటన్నారు. సాగు చట్టాల సమస్యను పరిష్కరించే ఉద్దేశం కేంద్రానికి లేదా? అని ప్రశ్నించారు.