సలహా: మీ నాన్నగారికి వచ్చిన సమస్యను పల్మనరీ థ్రాంబో ఎంబాలిజమ్ అంటారు. ఊపిరితిత్తుల సమస్యగా కనిపించినా ఇది కాలి సిరల్లోంచి పుట్టుకురావటం గమనార్హం. మన శరీరంలోని చెడు రక్తమంతా సిరల ద్వారా ముందు గుండెకు, అక్కడ్నుంచి ఊపిరితిత్తులకు చేరుకుంటుంది కదా. ఇలా ఊపిరితిత్తుల్లోకి చేరిన రక్తం ఆక్సిజన్ ను నింపుకొని తిరిగి గుండెకు, అక్కడ్నుంచి ధమనుల ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా అవుతుంది. ఇదంతా నిరంతరం జరిగే ప్రక్రియ. కొందరికి కాళ్లలో.. ముఖ్యంగా పిక్కలు, తొడల్లోని సిరల్లో చిన్న చిన్న రక్తం గడ్డలు ఏర్పడుతుంటాయి. రక్త ప్రసరణ నెమ్మదించటం, రక్తనాళాల గోడ పొరలు దెబ్బతినటం, రక్తం చిక్కగా అవటం వంటివి వీటికి దారితీస్తుంటాయి. కాళ్లు చేతులు కదలకుండా గంటలకొద్దీ ప్రయాణాలు చేసేవారికి, కూర్చునేవారికి వీటి ముప్పు ఎక్కువ. కాలి సిరల్లో ఏర్పడిన ఈ గడ్డలు కొన్నిసార్లు అక్కడ్నుంచి కదిలిపోవచ్ఛు ఊపిరితిత్తులకు చేరుకొని, అక్కడి రక్తనాళాల్లో చిక్కుకుపోవచ్ఛు దీంతో ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుంది.
రక్తం ఆక్సిజన్ ను నింపుకోకుండానే గుండెకు తిరిగి వచ్చేస్తుంది (షంట్). రక్తంలో తగినంత ఆక్సిజన్ లేకపోవటం వల్ల ఆయాసం తలెత్తుతుంది. ఊపిరితిత్తులు కుంచించుకుపోయి ఛాతీ నొప్పి రావొచ్ఛు ఈ రక్తం గడ్డలను అనుమానిస్తే డీ డైమర్ పరీక్ష చేస్తారు. గడ్డలేవైనా ఉంటే ఇందులో చూచాయగా తెలుస్తుంది. సమస్య ఉన్నట్టు అనుమానం వస్తే ఎక్స్ రే తీస్తారు. గడ్డలు చిన్నగా ఉంటే ఎక్స్ రేలో కనిపించకపోవచ్ఛు అప్పుడు ఊపిరితిత్తుల యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తారు. సమస్య నిర్ధారణ అయితే రక్తాన్ని పలుచగా చేసే హెపారిన్ మందును సెలైన్లో కలిపి ఎక్కువసేపు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో గడ్డలు కరిగిపోతాయి. ఇప్పుడు 24 గంటల పాటు పనిచేసే హెపారిన్ ఇంజెక్షన్లూ అందుబాటులో ఉన్నాయి. సమస్య తీవ్రత తగ్గాక హెపారిన్ మాత్రలు ఇస్తారు. వీటిని ఆరు నెలల పాటు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో సమస్య తిరగబెట్టకుండా చూసుకోవచ్ఛు ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే, బాగా ఆయాసం వస్తుంటే యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుంది.
ఇందులో తొడ దగ్గర్నుంచి చిన్న గొట్టం ద్వారా గడ్డ దగ్గరికి వెళ్లి ఎంజైమ్ ఇంజెక్షన్ ఇస్తారు. గడ్డ కరిగిపోతుంది. మీ నాన్నగారు హెపారిన్ మాత్రలు వేసుకుంటుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన మోతాదులోనే తీసుకోవాలి. మోతాదు ఎక్కువైతే చిన్న గాయమైనా రక్తస్రావమయ్యే ప్రమాదముంది. అందుకే డాక్టర్లు తరచూ పరీక్ష చేసి మందు మోతాదు సరిపోతుందా లేదా అనేది చూస్తారు. కాలి సిరల్లో రక్తం గడ్డలు ఏర్పడకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కార్లలో, విమానాల్లో ప్రయాణాలు చేసేవారు మధ్య మధ్యలో లేచి అటూ ఇటూ నడవాలి. పిక్కల మీద, తొడల మీద ఎక్కువగా ఒత్తిడి పడకుండా చూసుకోవాలి.
ఇదీ చూడండి : 'భారత్‌లో దాడికి ఐసిస్ యత్నం