జమ్ముకశ్మీర్‌లో అదనపు బలగాల మోహరింపు పలు ఊహాగానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఉగ్రకార్యకలాపాలు కొంతమేర తగ్గినప్పటికీ... భారీ మొత్తంలో భద్రతా దళాల మోహరించడంపై స్థానిక నాయకులు అభ్యంతరం తెలుపుతున్నారు.
ఆర్టికల్ 35ఏ రద్దు?
కశ్మీర్లో అదనపు బలగాల వార్తలు వినగానే అందరి దృష్టి మొదట 35ఏ, 370 అధికరణాల రద్దు అంశంపై పడింది. ప్రత్యేక హోదాను రద్దు చేసేందుకు కేంద్రం సమాయత్తమవుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్నాయి ఈ అధికరణాలు. 2014, 2019 ఎన్నికల్లో ఈ అధికరణాలు రద్దు అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో ఉంచింది భాజపా. ఈ పరిణామాల నేపథ్యంలో ఊహాగానాలకు మరింత ఊతమందింది. ఈ ఊహాగానాలను భాజపా ఖండించింది
పార్లమెంటు సమావేశాల తర్వాత ఆర్డినెన్సు?
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు ఈ నెల 7న ముగియనున్నాయి. సమావేశాలు ముగిసిన అనంతరం మోదీ సర్కారు ఆర్డినెన్సు జారీ చేయనున్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా బలగాలు మోహరించినట్లు చెబుతున్నారు.
'బలగాల విశ్రాంతికే చర్యలు'
జమ్ముకశ్మీర్‌లో భద్రతా స్థితిగతులు, బలగాలకు విశ్రాంతి కల్పించేందుకు రొటేషన్ ప్రాతిపదికన రాష్ట్రంలో పారామిలిటరీ దళాలను మోహరిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. వాటి గురించి బహిరంగంగా వెల్లడించే ఆనవాయితీ ఎన్నడూ లేదని పేర్కొంది.
ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్తత- ఎన్ఐటీ మూసివేత